యస్ బ్యాంకులో టిటిడి డిపాజిట్లపై విచారణ జరిపితే…లోగుట్టు బయట పడుతుంది..!

పతనావస్థలో ఉన్న యస్ బ్యాంకు నుంచి టిటిడికి చెందిన రూ.1300 కోట్ల‌ డిపాజిట్లను కొద్ది నెలల క్రితమే ఉపసం హరించుకు‌న్నట్లు వార్తలొచ్చాయి. యస్ బ్యాంకు బోర్డును ఆర్బీఐ రద్దు చేయడమే గాక…రూ.50,000 మించి నగదు ఉపసంహరణకు అవకాశం లేకుండా ఆంక్షలు విధించింది. ఈ పరిస్థితుల్లో యస్ బ్యాంకు నుంచి టిటిడి తన డిపాజిట్లను వెనక్కి తీసేసుకుని పెద్ద గండం నుంచి బయటపడిందని అందరూ చెబుతున్నారు. నిజంగా కూడా ఇది మంచి నిర్ణయమే.

అయితే…బ్యాంకింగ్ రంగం గురించి, షేర్ మార్కెట్ గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా‌ యస్ బ్యాంకు మునిగిపోతున్న పడవ అనే సంగతి అర్థమవుతుంది. అంతర్గత వ్యవహారాల కారణంగా యస్ బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఏడాది క్రితం రూ.275 ఉన్న ఈ బ్యాంకు షేర్ విలువ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఇప్పుడు రూ.15కు చేరుకుంది. నిధుల సమీకరణకు యస్ బ్యాంకు బోర్డు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరికి ఆర్.బి.ఐ. జోక్యం చేసుకుని బోర్డును రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది.

అసలు విషయానికొస్తే…ఇటువంటి దుస్థితిలో ఉన్న ‌యస్ బ్యాంకులో టిటిడి డిపాజిట్లు ఇంతకాలం ఎందుకు కొనసాగించారన్నదే. టిటిడికి పెద్ద అకౌంట్స్ విభాగం ఉంది. బాలాజీ ఎఫ్ అండ్ సిఏఓగా ఉన్నారు. ఆయనపైన మరింత బాధ్యత ఉంటుంది. డిపాజిట్లు వెనక్కి తీసుకునే సంగతి‌ అటుంచితే…ఇందులో డిపాజిట్లు ఎప్పుడు పెట్టారు, ఆ సమయంలో యస్ బ్యాంకు పరిస్థితి ఏమిటి, బ్యాంకు గురించి‌ అధ్యయనం చేశారా…వంటి అంశాలపైన విచారణ జరిపించాన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే రూ.1300 కొట్లు బ్యాంకులో చిక్కుకుపోయి వుంటే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.

ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ డిపాజిట్ల వె‌నుక ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముడుపుల కోసమే ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారన్న ప్రచారం ఉంది.‌‌ ఈ పరిస్థితుల్లో టిటిడి కి చెందిన రూ.12 వేల కోట్ల డిపాజిట్ల పరిస్థితి ఏమిటో సమీక్షించాలని భక్తులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*