రఘురామ కృష్ణంరాజు గారూ, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తారా..!

తిరుమల వెంకటేశ్వరస్వామి రాజకీయాలకు వాడుకోవడం పరిపాటిగా మారిపోయింది. టిటిడి అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనేవారు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అధిష్టానం పట్ల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆయన పదే పదే టిటిడిని, శ్రీవారిని వివాదంలోకి లాగుతున్నారు.

నర్సాపురం ఎంపీ గా ఉన్న ఆయనకు అక్కడ రాజకీయంగా ఏవో ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకించి గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులను నియోజకవర్గ ఇన్చార్జి గా చేసినప్పుటి నుండి ఆయన అభద్రతాభాలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన అసంతృప్తిని ఏదో విధంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బాహాటంగా విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపైన క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేసింది.

తాను తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకం గురించి ప్రశ్నించినందుకే తనకు నోటీసులు జారీ చేశారని ఆయన పదేపదే చెబుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ కోరుకున్నారని, ఇది నేరమా అని ప్రశ్నిస్తున్నారు. టిటిడి అస్తుల గురించి ప్రశ్నించడంతో తనను క్రైస్తవ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని కూడా ఆరోపించారు.

ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో రెండు ఎత్తుగడలున్నాయి. తాను హిందూత్వ వాదినని చెప్పుకుంటూ జిజెపికి దగ్గరవడం, జగన్ క్రైస్తవ మత విశ్వాసకులు కాబట్టే తనపై కక్షగట్టారని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధిపొందడం.

టిటిడి నిరర్ధక‌ ఆస్తుల విక్రయం వివాదంగా మారడం, తక్షణం స్పందించిన టిటిడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఎప్పుడో ముగిసిన ఈ వివాదాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు రఘురామ కృష్ణంరాజు.

అసలు ఆయన శ్రీవారి ఆస్తుల గురించి మొదట్లో మాట్లాడిందే రాజకీయాల కోసం. ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడినందుకే అధిష్టానం తనపై కక్షగట్టిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు రాజకీయాలు చేసుకోవ చ్చుగానీ…అందుకు తిరుమల శ్రీవారిని వాడుకుంటే, స్వామివారు ఆయన్ను క్షమించరని ఏడుకొండలవాడి భక్తులు అంటున్నారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*