రజనీకాంత్‌కు ‘అమాయకపు అభిమాని’ ప్రశ్న : మీరు కీలుబొమ్మ…మమ్మల్ని ఆడిస్తున్నవారెవరో చెప్పండి!

రాజకీయ ఆరంగేట్రం చేస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై ప్రతిపక్ష డిఎంకే తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రజనీకాంత్‌ కీలుబొమ్మలా మారారని, ఆయన్ను ఎవరో వెనకవుండి ఆడిస్తున్నారని విమర్శించింది. ఈ మేరకు డిఎంకే అధికార పత్రిక ‘మురసోలి’లో ఓ కథనాన్ని ప్రచురించారు. ‘అమాయకపు అభిమాని’ పేరుతో ప్రచురితమైన ఈ కథనంలో రజనీకాంత్‌ తీరుపై విమర్శలు గుప్పించారు.

కేరళ అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రజనీకాంత్‌ స్పందిస్తూ….సంప్రదాయాలను కాపాడాలని వ్యాఖ్యానించారు. ఇది మత ఛాందసాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ డిఎంకే ఆయన్ను తప్పుబట్టింది. రజనీ మతతత్వ అంశాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించింది. రజనీ వెనుక బిజెపి ఉందని అర్థమొచ్చేలా వుంది ఆ కథనం.

ఓ అమాయకపు అభిమానిగా అడుగుతున్నాం చెప్పండి…మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. మీరు కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారారు. వారు ఆడించినట్లు ఆడుతున్నారు. ఇంతకీ మిమ్మల్ని ఆడిస్తున్నదెవరో చెప్పండి….అంటూ నిలదీస్తూ ఈ కథనం వ్యాఖ్యనించింది. మీకు ఏ పదవులపైనా ఆశ లేనపుడు 234 స్థానాలో పోటీ చేస్తానని ఎందుకు చెబుతున్నారని కూడా రజనీకాంత్‌ను డిఎంకే ప్రశ్నిస్తోంది.

ఈ కథనంపై రజనీకాంత్‌ స్పందించారు. మనం ఏ దారిని ఎంచుకున్నా స్పష్టంగా, నిజాయితీగా ఉండేలా చూసుకుందాం. మీ వంటి అభిమానులు ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది…అని తనదైన శైలిలో జవాబు ఇచ్చారు సూపర్‌ స్టార్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*