రజనీకాంత్‌ కాలా సినిమాలో మన తిరుపతి కథ!

రజనీకాంత్‌ కథనాయుడిగా నటించిన ‘కాలా’ సినిమా చూస్తే తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీ కథ గుర్తుకొస్తుంది. స్మార్ట్‌ సిటీ పేరుతో నగరంలోని స్కావెంజర్స్‌ కాలనీలో ఉంటున్న వారికి అన్యాయం చేయాలని ప్రయత్నించారు. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని అపార్టుమెంట్లు నిర్మిస్తామని ఒత్తిడి చేశారు. అయితే…తమకు అపార్టుమెంట్లు అవసరం లేదని, ఇప్పుడున్నట్లే ఎవరికి వారికి ప్రత్యేక ఇళ్లు ఉండాలని, అదే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని స్కావెంజర్స్‌ కాలనీ వాసులు తేల్చిచెప్పారు. తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దీంతో అపార్టుమెంట్ల పేరుతో పేదలను పక్కకు నెట్టేసి, కాలనీ జాగాలను కొట్టేయాలనుకున్నవారి పన్నాగం పారలేదు.

కాలా సినిమా కూడా ఇదే కథాంశంతో సాగుతుంది. స్వచ్ఛ ముంబయి పేరుతో ఆ నగరంలోని ధారావి అనే మురికివాడల్లోని పేదలను ఖాళీ చేయించడానికి జరిగే ప్రయత్నాలను ఆ కాలనీవాసులు పోరాటంతో ఎదుర్కొంటారు. కాలనీని ఖాళీ చేయించడం కోసం అపార్టుమెంట్ల ఆశ చూపుతారు. అయినా అక్కడి ప్రజలు అందుకు అంగీకరించరు. పోరాటంతో ప్రభుత్వ ఆలోచనను తిప్పకొడతారు.

తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీవాసుల పోరాటం గురించి తెలిసిన వారికి….కాలా చూస్తున్నంత సేపు అదే గుర్తుకొస్తుంది. పేదలకు ఇల్లు అంటే…కేవలం తాము తలదాచుకోడానికి పనికొచ్చే గూడు మాత్రమే కాదు. పేదల ఇళ్ల వద్ద మేకలుంటాయి, గొర్రెలుంటాయి, కోళ్లు ఉంటాయి, ఇంటి వద్దే బట్టలు ఉతికేవాళ్లు ఉంటారు, ఇంటి వద్దే కంసాలి పని చేసేవాళ్లు ఉంటారు….చాలా పనులు చేసేవాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లకు అపార్టుమెంట్లు ఏవిధంగానూ ఉపయోగపడవు. ఐదో అంతస్తులోనో ఆరో అంతస్తులోనో ఇల్లు ఇస్తే….తాను పోషిస్తున్న ఆవును ఎక్కడ కట్టేయాలి, కోడిపిల్లలను ఎక్కడ మూసిపెట్టాలి. బట్టలు ఎక్కడ ఉతకాలి…ఇలాంటి ఆచరణాత్మక సమస్యలు అనేకం ఉంటాయ. అందుకే స్కావెంజర్స్‌ కాలనీ ప్రజలు లక్షలాది రూపాయల అపార్టుమెంట్లను కాదనుకుని, ఉన్నఇళ్లే చాలనుకున్నారు. కలాలోనూ పేదలు….పెద్ద అపార్టుమెంటులో ప్లాటు ఉండటం కంటే సొంతంగా జానెడు జాగా ఉండటమే అవసరమని గుర్తించి పోరాడి విజయం సాధిస్తారు.

ఒక్క తిరుపతిలోనో, ముంబయిలోనో కాదు….దేశమంతా ఇప్పుడే అదే లోచనలు సాగుతున్నాయి. పట్టణ నడిబొడ్డున మురికివాడలు ఉండటాన్ని నామూషాగా భావిస్తున్నారు. స్మార్ట్‌ సిటీల ఆలోచనతో పేదలను ఊరి బయటకు తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో రజనీకాంత్‌ కాలా చిత్రానికి సరైన కథనే ఎంచుకున్నారు. అయితే…సరైన పరిష్కారం చూపడంలో మాత్రం కాలా చిత్రం విజయవంతం కాలేకపోయింది. పేదలు ఉంటున్న కాలనీల్లోనే వాళ్లకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. అదే అన్నింటికీ పరిష్కారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*