రజనీకాంత్‌ ‘పుట్టగొడుగా’…ఎంతమాట ఎంతమాట!

జయలలిత మరణం తరువాత తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలు యావగింపు కలిగిస్తున్నాయి. అధికార అన్నా డిఎంకే మ్కులు ముక్కలు ముఖ్యమంత్రి పీఠం కోసం తన్నులాడుకున్న తీరు, కేంద్రం తెరవైపు నుంచి బొమ్మలను ఆడించిన వైనం, ఇప్పటికీ మోడీ చెప్పినట్లు తలూపుతున్న ముఖమంత్రి, ఉపముఖ్యమంత్రుల తీరు…ఇవన్నీ దేశ వ్యాపితంగా తమిళనాడును పలచన చేశాయి. ఈ క్రమంలోనే సినీనటులు కమల్‌ హాసన్‌, రజీనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం చేయడంతో తమిళ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ ఇద్దరి మధ్య పొత్తువుంటుందా ఉండదా అనేది ఇంకా తేలాల్సివుంది. తమ రాజకీయాలు వేరేవేరని కమల్‌ హాసన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నింటికన్నా ముఖ్యం రజనీకాంత్‌ ఇంకా పార్టీపేరు వెల్లడించలేదు. దానికీ మూహూర్తం వస్తుందంటున్నారుగానీ ఎప్పుడొస్తుందో ఇంకా చెప్పలేదు. అయితే ఆయన రాక తమకు ప్రమాదమని తెలుసుకున్న అధికార పార్టీ రజనీపై దాడి మొదలుపెట్టింది. రజనీకాంత్‌కు తమిళనాడులోని 234 స్థానాల్లో కనీసం 150 స్థానాల్లో ప్రభావం చూపగల శక్తివుందని ఓ సర్వేలో తేలిందట. అప్పటి నుంచి అధికార పార్టీ దాడి మొదలుపెట్టింది. రజనీకాంత్‌ను తక్కువ చేసి చూపడానికి….’నిన్న రాత్రి కురిసన వర్షానికి నేడు మొలచిన పుట్టగొడుగు. త్వరలోనే కనిపించకుండాపోతుంది’ అని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి విజయకుమార్‌ వ్యాఖ్యానించారు. పుట్టగొడుగు జీవితకాలం కొన్ని గటలు మాత్రమే. చిన్నపాటి ఎండకు కూడా ఆది వాడిపోతుంది. రజనీపెట్టబోయే పార్టీ కూడా అంతే అనేది ఆయన మాటల సారాంశం. ఈ విధంగా తక్కువ చేయడం ద్వారా ఎవరై ఆ పార్టీ వైపు వెళ్లకుండా చేయడం ఆ మంత్రిగారి ఉద్దేశం కావచ్చుగానీ…ప్రభుత్వం పోయాక ఈ మంత్రిగారైనా అన్నా డిఎంకేలో ఉంటారా? అనేది ప్రశ్న. ఇటు రజనీ పార్టీకైనా, అటు కమల్‌ పార్టీకైనా, ప్రతిపక్షంలోని డిఎంకే పార్టీకైనా మొదలుగా వలసలు మొదలయ్యేది అన్నాడిఎంకే నుంచే. ప్రస్తుతం ఆ పార్టీని మోడీ వెనుక వుండి నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ మాటల దాడి వెనుకా బిజెపి ఉండొచ్చు అని సందేహించడంలో తప్పులేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*