రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

తిరుమ‌ల‌లో ఫిబ్ర‌వ‌రి 12న రథసప్తమి పర్వదినం నాడు శ్రీవారి వాహనసేవలను వీక్షించేందుకు భక్తకోటికి భక్తిభావంతో మెరుగ్గా సేవలందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కోరారు. ర‌థ‌స‌ప్త‌మి విధులు కేటాయించిన అధికారుల‌కు, సిబ్బందికి గురువారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారు ఏడు వాహనాలపై దర్శనమిస్తారు కావున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తారని తెలిపారు. గ్యాల‌రీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 300 మంది టిటిడి అధికారులకు, సిబ్బందికి నాలుగు మాడ వీధులలో విధులు కేటాయించినట్లు వివరించారు. ప్ర‌తి గ్యాల‌రీలో టిటిడి సిబ్బందితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. గ్యాలరీల్లో త‌గినంత మంది భ‌క్తుల‌ను నింపాల‌న్నారు. భ‌క్తుల‌కు సమయానుకూలంగా టి, కాఫి, అల్పాహారం, మ‌జ్జిగ‌, అన్నప్రసాదాలు, సుండ‌ల్‌ అందేలా చూడాలన్నారు. వాహనసేవల సమయంలో గ్యాలరీల్లోని భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా స‌హ‌క‌రించాలని సూచించారు. ఆరోగ్య విభాగం సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త త‌ర‌లించాల‌ని, మ‌రుగుదొడ్లు ప‌రిశుభ్రంగా ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. ఇత‌రులు అన్న‌దానం చేయ‌డాన్ని నిషేధించిన‌ట్టు తెలిపారు. అధికారులు, సిబ్బంది క‌లిసి ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇలు శ్రీ ఎ.రాములు, శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ శాస్త్రి ఇత‌ర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*