రమణకుమార్‌ నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా?

టిటిడిలో వందల కోట్ల విలువైన ఆభరణం మామయిందని 2008లో అప్పటి టిటిడి సివిఎస్‌వో రమణకుమార్‌ ఇచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నాయా…అనే అనుమానం కలుగుతోంది. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు టిటిడికి సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. రాజశేఖర్‌ రెడ్డి ఏడు కొండలను రెండు కొండలకే పరిమితం చేస్తూ జీవో ఇచ్చారంటూ పెద్ద దుమారంరేపారు. అందులోని విషయాల జోలికి ఇప్పుడు వెళ్లడం లేదు. అయితే…ఆ సమయంలోనే 2001నాటి పింక్‌ డైమండ్‌ విషయం బయటకు వచ్చింది. ఆభరణాలపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రమణకుమార్‌ ఓ నివేదిక తయారు చేశారు. అందులో వందల కోట్ల విలువైన పింక్‌ డైమండ్‌ కనిపించకుండాపోయిందని రాశారు. ఈ నివేదిక తరువాత, అప్పుడు ప్రతిపక్షంలో టిడిపి పింక్‌ డైమండ్‌ గల్లంతుపై సిబిఐ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. తాజాగా రమణ కుమార్‌ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటవ్వ్యూలో పింక్‌ డైమండ్‌ ఉన్నదీ, లేనిదీ తనకు తెలియదన్నట్లుగా; రమణ దీక్షితులు చెప్పిన ఆధారాలను బట్టే నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంటే ఆనాడు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు, డిమాండ్లకు తగినట్లు నివేదిక ఇచ్చారని అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇంటర్వ్యూలో ఇంకోమాట కూడా చెప్పారు. ‘ఆ సమయంలో (నివేదిక ఇచ్చిన సమయంలో) ఛైర్మన్‌గా కరుణాకర్‌ రెడ్డి, సభ్యునిగా విజయ్‌సాయి రెడ్డి ఉన్నారు. రమణ దీక్షితులు కోరుతున్నట్లు డైమండ్‌పై సిబిఐ విచారణ చేయాల్సివుంటే..ఎవర్ని విచారించాలో అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. వజ్రం ఉందా, పోయిందా, పోయివుంటే సిబిఐ విచారణ జరపాలా వాద్దా అనేది చెప్పకుండా….సిబిఐ విచారణ జరపాల్సివస్తే కరుణాకర్‌ రెడ్డిని, విజయసాయిరెడ్డిని విచారించాల్సివుంటుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.

అదేవిధంగా వజ్రం గురించి చెప్పడంకంటే…రమణ దీక్షితులు అవినీతిపరుడని ఎక్కువగా చెప్పారు. అన్నదానానికి సంబంధించిన డబ్బులను తన ఖాతాలో వేసుకున్నారని, తానే పట్టుకున్నానని, ఆలయ ప్రతిష్టరీత్యా దాన్ని బయటకు చెప్పలేదని పేర్కొన్నారు. నిజంగానే ఆలయ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని బయటకు చెప్పకూడదనుకుని ఉంటే ఇప్పుడూ చెప్పకూడదు. మరి ఇప్పుడెందుకు చెప్పినట్లు? వజ్రం వరకే పరిమితం అయివుండొచ్చు. అదేవిధంగా అమిత్‌షాను ఆలయంలో రమణదీక్షితులు ఆహ్వానించడాన్ని కూడా తప్పుబట్టారు. దీక్షితులు బిజెపికి అనుకూలంగా మాట్లాడటం సరైనది కాదంటూ రాజకీయాలూ ప్రస్తావించారు. రమణ కుమార్‌ ఆరోపణలపై వైసిపి స్పందించాలి. ప్రధానంగా 2008లో ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*