రమణదీక్షితులు గారూ…మీకో లేఖ!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును తొలగించడాన్ని కొందరు తప్పుపడుతుంటే కొందరు సమర్థిస్తున్నారు. సమర్థిస్తున్న ఓ వ్యక్తి ఫేస్ బుక్ ద్వారా రాసిన ఓ లేఖ ఇది…

**********************************

రమణ దీక్షితులు గారికి నమస్సుమాంజలులు.

తితిదే లో 65 సంవత్సరాల వయసు దాటిన వారందరినీ పదవీ విరమణ చేయమంటే మీకు ఆగ్రహం కలిగింది, అరిషడ్వర్గాలు జయించి, శ్రీవారి సేవకోసం సర్వం త్యాగం చేసి, భాగవతోత్తములు మీకు ఆగ్రహం ఏల స్వామీ ! అయినా ప్రభుత్వం మిరాశీ వ్యవస్థను , వంశపారంపర్య వ్యవస్థను కాదు అనలేదు కదా ! శ్రీవారి సేవకు అంకితమైన మీ కుటుంబానికి, మీ వారసులకు వారి సేవను దూరం చెయ్యలేదు కదా ! మరి ఇంత ఆగ్రహం ఎందుకు స్వామీ !

అయినా ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా ! శ్రీవారి ఆలయంలో సాంప్రదాయాలను గౌరవించాల్సిందే. ఎప్పుడో రూపొందించిన విధివిధానాలను కూడా పాటించాల్సిందే, అందులో వీసమెత్తు కూడా అనుమానం లేదు. ఆ విధంగానే పాటిస్తున మిరాశీ వ్యవస్థను ఇకముందు కూడా పాటించాల్సిందే. కానీ ఆ విధివిధానాలలో జీవితకాలం పాటు ప్రధానపూజారిగా వారే ఉండాలని లేదు కదా ! మరి ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ అతిక్రమించినట్లు స్వామీ ! ఎందుకు స్వామీ లెనిపోని ఈ ఆరోపణలు.

65 సంవత్సరాల తర్వాత మీరు పదవీ విరమణ చేస్తారు, మీ స్థానంలో మీ తర్వాత సీనియర్ పూజారి ఆ భాధ్యతలు స్వీకరిస్తారు, స్వామి వారి సేవలకు కానీ, కైంకర్యాలకు కానీ, పూజలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ! మీ తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ పూజా విధానాలు, సాంప్రదాయాలు తెలియవా ! ఒకవేళ నిజంగా మీకు తప్ప మరెవ్వరికీ తెలియవు అనుకుందాం , మిమ్మల్ని మీ జీవితకాలం ప్రధానపూజారిగానే కొనసాగించారు అనుకుందాం, భవిష్యత్తులొ ఎప్పుడో మీరు పరమపదించిన తర్వాత అయినా మరొకరు ఆ భాధ్యత స్వికరించాలి కదా ! మరి అప్పుడు స్వీకరించేవారికి పూజా విధానాలు, సాంప్రదాయాలు తెలియక శ్రీవారికి అపచారం జరిగితే ఎలా ! అప్పుడు గుడి మూసేద్దామా !!

ఇక కొంతమంది చెప్తున్నట్లు ఇది భ్రాహ్మణత్వం మీద దాడి అనటం విచిత్రంగా ఉంది, రమణ దీక్షితులు ఒక్కరే బ్రాహ్మణుడా, ఆయన పదవీ విరమణ తర్వాత ఆ భాద్యత తీసుకోబొయే వారు కూడా బ్రాహ్మణులే కదా ! మరి బ్రాహ్మణుల మీద దాడి ఎక్కడ ! ఎలా !! నిజానికి ఈ పదవీ విరమణ నిబందన వల్ల ఎక్కువ మంది బ్రాహ్మణులకు అవకాశాలు దొరుకుతాయి. (నిజానికి ప్రస్తుత పౌరోహిత్యం వృత్తిగా ఉన్న బ్రాహ్మణ యువకుల పరిస్థితి చాలా దీనంగా ఉంది, కనీసం వివాహం చేసుకోవటానికి కూడా ఎవ్వరూ ముందుకు రావటం లేదు, వందల వివాహాలు జరిపిస్తూ, వారు మాత్రం అవివాహితులుగానే ఉండిపోవటం వారిని మానసికంగా ఎంత నలిగిపోయేలా చేస్తుందో ఆలోచిస్తే అదో బాదాకర పరిణామం) , చిన్న చిన్న ఆలయాల్లో తప్ప చాలా ఆలయాల్లో యువకులు పూజారులుగా యువకులు కన్పించటం చాలా అరుదై పొయింది. పరిస్థితి ఇలాగే సాగితే కొన్ని సంవత్సరాల తర్వాత వేదం, మంత్రం అన్నీ ఆడియో లో వినాల్సివస్తుంది తప్ప , అది పఠించగలిగేవాళ్ళు దొరకరు. నిజానికి ఈ పరిణామం, యువ బ్రాహ్మణులను తిరిగి పౌరోహిత్యం వైపు మళ్ళిస్తుంది.

– గిరిబాబు కాళహస్తి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*