రమణ దీక్షితులకు ఒక ప్రశ్న…శ్రీనివాసరాజుకు ఒక ప్రశ్న!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన టిటిడి జెఈవో శ్రీనివాసరాజు సుదీర్ఘనమైన వివరణ ఇచ్చారు. తాను చెప్పదలచుకున్నది అర్థగంటకుపైగా చెప్పిన ఆయన విలేకరులకు ప్రశ్నలు అడిగే అవకాశమూ ఇవ్వలేదు. సాధారణంగా ఎవరైనా తాను చెప్పదలచుకున్నది చెప్పిన తరువాత ఏవైనా ప్రశ్నలు వుంటే అడగమని పాత్రికేయులకు అవకాశం కల్పిస్తారు. జేఈవోను విలేకరులు ఏదో అడగబోగా…’ప్రశ్నలు అడకూడదు’ అంటూ మీడయా సమావేశాన్ని ముగింశారు. అయితే సాధారణ భక్తులకూ కలుగుతున్న ఒకేఒక ప్రశ్న మాత్రం జెఈవో శ్రీనివాసరాజును అడగాలని ధర్మచక్రం భావిస్తోంది.

ఆగమ సలహామండలి సభ్యులు ఒక్కరే కాదు, ఐదుగురు ఉంటారు. వీరిలో అప్పికట్ల దేశికాచార్యులు, సుందరవదనాచార్యులు, జగన్నాథాచార్యులు, మోహనరంగాచార్యులు, రమణ దీక్షితులు ఉన్నారు. ఆలయానికి సంబంధించిన ఏ పని చేయాలన్నా సందర్భానుసారంగా సలహా మండలి సభ్యుల నుండి సమష్టిగాను లేదా వ్యక్తిగతంగాను సలహాలు స్వీకరించే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో 2017 డిసెంబరులో జరిగిన అన్నప్రసాదం పోటు మరమ్మతులకు సంబంధించి పెద్దజీయర్‌స్వామి, ఆగమ సలహా మండలి సభ్యులు సుందరవదనాచార్యుల నుండి సలహాలు స్వీకరించాం…..అని జెఈవో చెప్పారు. అంటే ఆయన చెప్పిన ప్రకారమే…పోటు మరమ్మతులకు రమణ దీక్షితుల ఆమోదంగానీ, సలహాలుగానీ తీసుకోలేదని తేలిపోయింది. అయినా టిటిడి ఆగమ సలహా మండలిలో ఐదుగురు ఆగమ పండితులు ఉండగా ఒకరితోనే ఆమోదం తీసుకోవడం ఎందుకు? ఐదుగురి సలహాలూ తీసుకుని, మెజార్టీ సభ్యులు చెప్పినట్లు చేసివుంటే ఇబ్బంది ఉండేది కాదుకదా? ఆలయ ప్రధాన అర్చకుడు కూడా అయిన రమణ దీక్షితులు సలహాకు మరింత ప్రాధాన్యత ఉంటుంది కదా? ఆయనన్ను ఎందుకు విస్మరించారు. పోటు మరమ్మతులకు ఆయన అంగీకరించరని తెలిసి సంప్రదించలేదా? లేక అప్పటికే ఆయనతో ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకుని పక్కనపెట్టేశారా? ప్రధాన అర్చకులనే విస్మరించారంటే…. ఆలయంలో అధికారులు అర్చకులనూ లెక్కచేయరు అని రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నట్లే కదా?! మరి దీనికి శ్రీనివాసరాజు ఏమంటారు?

రమణ దీక్షితులుకు
శ్రీవారి పోటుకు సంబంధించి రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలకు జెఈవో సహేతుకమైన వివరణ ఇచ్చారు. ‘2001వ సంవత్సరంలో ఆగమ సలహామండలి సలహా మేరకు ప్రసాదం పోటులో, పడిపోటులో ఆలయ సంస్కృతిని ప్రతిబింబించేలా స్తంభాలను తీర్చిదిద్దేందుకు సంపంగి ప్రాకారంలో వెలుపల షెడ్డు వేసి తాత్కాలికంగా శాస్త్రోక్తంగా ప్రసాదాలు తయారుచేయడం జరిగింది. 2007లో అన్నప్రసాద పోటులో అగ్నిప్రమాదం జరిగినపుడు కూడా పడిపోటులో ప్రసాదాల తయారీ జరిగింది. 2008లో తిరిగి అన్నప్రసాద పోటులో మరమ్మతులు చేసినపుడు కూడా పడిపోటులోనే అనప్రసాదాలు తయారు చేయడం జరిగింది. ఆ తరువాత 2017 డిసెంబరు 9 నుండి 2018, జనవరి 5వ తేదీ వరకు ప్రసాదం పోటులో అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంలోనూ గతంలో చేసిన విధంగానే సంపంగి ప్రాకారంలో షెడ్డు వేసి ప్రసాదాలు తయారు చేశాం’ అని జెఈవో చెప్పారు.

గతంలో రెండు పర్యాయాలు ఇప్పుడు చేసినట్లే పడిపోటులో అన్నప్రసాదాలు తయారు చేసినట్లు స్పష్టంగా చెబుతున్నారు. మరి అప్పుడు రాని మలినం సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది? అదేవిధంగా పడిపోటులో తయారు చేసే లడ్డూలు, వడలు, దోసెలు శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నప్పుడు….అక్కడ అన్నప్రసాదాలు తయారు చేస్తే దైవద్రోహమైపోతుందా? అక్కడ ప్రసాదాలు తయారు చేయడం వల్లే స్వామి పస్తులున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే పడిపోటులో తయారవుతున్న లడ్డూలు, దోసెలు, వడలు స్వామివారు స్వీకరించడం లేదా? మరయితే…అక్కడ ఆ ప్రసాదాల తయారీపైన రమణ దీక్షితులు అభ్యంతరం చెప్పడం లేదు ఎందుకు? తన ఆమోదం లేకుండా పోటులో మరమ్మతులు చేసినందుకే స్వామిని పస్తులు పెట్టారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా? రమణ దీక్షితులు చెప్పాల్సింది ఒకటే ఒకటి…గతంలో రెండు పర్యాయాలు పడిపోటులో అన్నప్రసాదాలు తయారు చేశారా లేదా? గతంలో అ రెండుసార్లు ఇదే విధంగా చేశామని టిటిడి అధికారులు పదేపదే చెబుతున్నా దానికి రమణ దీక్షితులు ఎందుకు స్పందించడం లేదు? అది నిజమైతే ఇప్పుడు తాను చేస్తున్న విమర్శలు తప్పని అంగీకరించాలి. ఇప్పుడు తాను చేస్తున్న ఆరోపణలు వాస్తమైతే అధికారులు చెబుతున్నది అసత్యమని చెప్పాలి. దీనిపై రమణ దీక్షితులు సమాధానం చెబుతారా?

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*