రమణ దీక్షితులకు టిటిడి ‘అపురూప కానుక’!

ప్రధాన అర్చకుడిగా రెండు దశాబ్దాలకుపైగా శ్రీవారికి సేవలందించిన రమణ దీక్షితులకు టిటిడి అరుదైన, అపురూపమైన కానుక ఇచ్చింది. మామూలుగా టిటిడి ఉద్యోగులు రిటైర్‌ అయితే స్వామివారి బంగారు డాలరు ఇవ్వడంతో పాటు, ఆ ఉద్యోగిని కుటుంబ సమేతంగా గౌరవంగా ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించి పంపుతారు. దేవుడి వద్దే పని చేసిన రమణ దీక్షితులకు ఇవన్నీ ఎందుకనుకున్నారో ఏమోగానీ…ఆయన పట్ల చాలా భిన్నంగా వ్యవహరించారు. ఆయన్ను ప్రధాన అర్చక పనిలోంచి తొలగిస్తూ ఒక రోజు వ్యవధిలో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న టిటిడి అధికారులు… దాని అమలు కూడా అంతే వివాదాస్పదంగా చేశారు.

ప్రధాన అర్చక పదవి నుంచి తొలగిస్తున్నట్లు నోటీసును రమణదీక్షితులకు అందజేయడానికి అధికారులు తహతహలాడిపోయారు. సహజంగానే టిటిడి తీసుకున్న నిర్ణయం ఆయన్ను ఖిన్నుడిని చేసివుంటుంది. తీవ్రమస్థాపం కలిగించివుంటుంది. దీంతో ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఎన్ని రోజులైనా ఆయన రావాల్సిందే. అయితే అప్పటిదాకా ఆగలేపోయారు. ఆస్తులు జప్తు కోసం కోర్టు నోటీసులు ఇస్తే….ఈ విధంగా ఇంటి తలుపుకు అంటించి వెళుతారో….ఆదే రీతిలో నోటీసులను రమణ దీక్షితులు ఇంటి గోడకు అంటించారు అధికారులు. ఇన్నేళ్లు పనిచేసిన ఓ అర్చకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన వ్యక్తిగా తప్పు చేసివుండొచ్చు. తొందరపడివుండొచ్చు, కానీ ఒక సంస్థగా, అదీ ధార్మిక సంస్థగా తొందరపడటం, కక్షపూరితంగా వ్యవహరించడం తగనిపని. అధికారుల తీరు చూస్తుంటే…ఆయన్ను ఎప్పుడెప్పుడు ఆలయం నుంచి వెళ్లగొడదామా అని తపనపడిపోతున్నట్లు కనిపిస్తుంది. రమణ దీక్షితులు శ్రీవారిని నమ్ముకోవడం కంటే ఆసాములను నమ్ముకుని ఉంటే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*