రమణ దీక్షితులుగారూ….తిరుపతికి రండి మాట్లాడుకుందాం!

‘రమణ దీక్షితులుగారూ…గత కొంతకాలంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాం. ప్రధాన అర్చక పదవి నుంచి ఆకస్మికంగా తొలగించడం వల్ల మీకు అన్యాయం జరిగిందని భావిస్తుంటే…..తిరుపతికి రండి, ఈవోగారితో కూర్చుని మాట్లాడుకుందాం. మీ తరపున మేమే మాట్లాడుతాం. అధికారులు దిగిరాకుంటే ఎటూ న్యాయపోరాడం చేయడానికి అవకాశాలున్నాయి. మిమ్మల్ని ఆ పదవి నుంచి దూరం చేశారన్న ఆగ్రహంతో టిటిడిపై, శ్రీవారి ఆలయపైన మీరు చేస్తున్న అభియోగాలు భక్తులకే కాదు టిటిడిలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకూ బాధ కలిగిస్తున్నాయి. మనోభావాలను భంగపరుస్తున్నాయి. అన్నింటికీ మించి ప్రపంచ ప్రఖ్యాతమైన టిటిడి ప్రతిష్ట మసకబారుతోంది. టిటిడిపై భక్తుల్లో అపనమ్మకం ఏర్పడుతోంది. టిటిడిని నమ్ముకుని వేలాది కుటుంబాలున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే ఈ కుటుంబాలన్నీ వీధినపడుతాయి. మీరు కొందరి మీద కోపంతో సంస్థను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. శ్రీవారికి కైంకర్యాలు సరిగా జరడం లేదని, పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, ఆభరణాలు మాయమయ్యాయని…ఇవేవో ఆరోపణలు చేస్తున్నారు. వాటినికి సంబంధించిన ఆధారాలు మాకూ ఇవ్వండి. నిజమైతే మేమూ అధికారులను నిలదీస్తాం. అంతేగానీ….ఇలా టిటిడి ప్రతిష్ట దెబ్బతీయొద్దు’ అని టిటిడి ఉద్యోగ సంఘా నాయలు రమణ దీక్షితుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులను ఎంతగానో గౌరవించిన, అభిమానించిన ఉద్యోగుల్లోనే నేడు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆయన వల్ల టిటిడికి చెడ్డపేరు వస్తోందనేది ఉద్యోగుల ఆవేదన. ఆ ఆవేదన నుంచే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిటిడి ప్రతిష్ట తిగజార్చవద్దంటూ టిటిడి ఉద్యోగులు గురువారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం (25.05.2018)న టిటిడి పరిపాలనా భవనం వద్ద ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. టిటిడిలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం కొందరు ఉద్యోగులు శ్రీవారి ఆలయంలోకీ నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లడం వివాదాస్పదం అయింది. దీన్ని కొందరు తప్పుబడుతున్నారు. నల్లబ్యాడ్జీలు బయట వరకే పరిమితం కావాల్సిందని అంటున్నారు.

ఇదిలావుంచితే…రమణ దీక్షితులు జాతీయ స్థాయిలో టిటిడిని చర్చనీయాంశంగా మార్చడం వల్ల ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అనే భయం ఉద్యోగుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీవారి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న వదంతులను గతంలో కొందరు వ్యాపింపజేశారు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బిజెపి జాతీయ నాయకురాలు శాంతారెడ్డిని ధర్మచక్రం ప్రతినిధి అడిగారు. దానికి ఆమె స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దేవాలయాన్ని, టిటిడిని కేంద్రం స్వాధీనం చేసుకోబోదని చెప్పారు. టిటిడిలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టడానికి మాత్రమే సిబిఐ విచారణ అడుగుతున్నామని చెప్పారు. టిటిడిలో జరిగే అక్రమాలపై విచారణ జరపడాన్ని టిటిడి ఉద్యోగులూ వ్యతిరేకించడం లేదు. నిర్ధిష్టమైన అంశాలపైన విచారణ జరిపితే తామూ సమర్థిస్తామని, విచారణ పేరుతో టిటిడిలో గందరగోళం, అయోమయం సృష్టిస్తారన్నదే తమ భయమని ఉద్యోగులు చెబుతున్నారు.

1 Comment

  1. TTD, at this hour, need to clarify few things to the devotees and it should maintain transperancy improving the existing system and also to follow aagama procedures on letter and spirit.

    As, it is executed by a senior most IAS officer of the nation, it does not matter, whether it is functioning under State or Central govt.

    In any case, it should not fall under perview of any political party which are not at all stable.

Leave a Reply

Your email address will not be published.


*