రమణ దీక్షితులుపై అస్త్రశస్త్రాలతో టిటిడి రెడీ!

శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న రమణ దీక్షితులుకు సమాధానం చెప్పేందుకు టిటిడి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లడనున్నారు. శ్రీవారి ఆలయంలో పోటును తవ్వేశారని, 15 రోజుల పాటు స్వామిని పస్తు పెట్టారని దీక్షితులు ఆరోపించారు. గుప్త నిధులు కోసమే పోటును తవ్వారన్న అనుమానాలనూ ఆయన వ్యక్తం చేశారు. పోటు తవ్వడం గురించి ఈవోను అడిగితే తనకు తెలియదని ఆయన చెప్పినట్లు దీక్షితులు చెబుతున్నారు. అదేవిధంగా శ్రీవారి ఆభరణాల భద్రతపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యేకించి గులాబీ రంగు వజ్రం ఒకటి కనిపించకుండా పోయిందని, కోట్ల విలువైన ఈ వజ్రాన్ని విదేశాల్లో వేలం వేసినట్లు పత్రికల్లో చదివానని రమణ దీక్షితులు చెబుతున్నారు. వీటన్నింటికీ ఇప్పటికే అర్చకులు ద్వారానూ, జియ్యంగార్ల ద్వారానూ టిటిడి వివరణ ఇప్పించింది. అయితే ఇప్పటిదాకా ఉన్నతాధికారులు ఎవరూ వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడనున్నారు. దీక్షితులు చేస్తున్న ఆరోపణకు వివరణ ఇవ్వడంతో పాటు ఆయన్ను ఆత్మరక్షణలో పడేసేవిధంగా ఇప్పటికే ఉన్న ఫిర్యాదులను బయటపెట్టే అవకాశాలున్నాయి. దీక్షితులు అర్థరాత్రి విఐపిలను ఆలయంలోకి తీసుకెళ్ళి పూజలు చేయించారని దేవాదాయ శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఆరోపణలు, విమర్శలను బయటకు తీసి రమణ దీక్షితులుపై అందించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు, నివేదికలు, ఆధారాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈవో ప్రెస్ మీట్ తో ఎలాంటి కొత్త వివాదాలు, విషయాలు బయటికొస్తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*