రమణ దీక్షితులు చేస్తున్న తప్పులేమిటి?

తిరుమల శ్రీవారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటులో తవ్వకాలు జరిగాయని, శ్రీవారికి వజ్రాల హారంలోని గులాబి వర్ణ వజ్రం ఒకటి మాయమయిందని విమర్శలు చేసినందుకు…వంశపారంపర్య అర్చకత్వాన్ని పోగొట్టుకున్న రమణ దీక్షితులు చేస్తున్న పోరాటం దేశాన్ని ఆకర్షిస్తోంది. ఆయన సాగిస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నవారు ఉన్నట్లే…. టిటిడి ప్రతిష్ట మంటగలుస్తోందన్న ఆవేదనతో ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. దీక్షితులు సాగిస్తున్న పోరాటంలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. వాటిని దిద్దుకుంటే ఆందోళన సరైన మార్గలో వెళితే అందరి అండ దండలు ఆయనకు లభిస్తాయి.

రమణ దీక్షితులు తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్ధిష్టంగా చెప్పాలి. స్వామివారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదన్నారు. 20 నిమిషాలు జరగాల్సిన తోమాల సేవ 10 నిమిషాల్లో ముగించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఏ రోజు అలా జరిగిందో..నిర్ధిష్టంగా చెప్పగలిగితే, విచారణ జరపడానికి ఉపయోగపడుతుంది. అలా చెప్పడం వల్ల దీక్షితులు చెప్పే అంశాలపైన విశ్వాసమూ ఏర్పడుతుంది.

ఇక పోటులో తవ్వకాల విషయం ఈవోకు కూడా తెలియదని చెబుతున్నారు. మరి ఈవోను కూడా ఖాతరు చేయకుండా తవ్వకాలు జరిపించిన అధికారి ఎవరో నిర్ధిష్టంగా చెబితే…ఆ అధికారి గురించి భక్తులు ఆలోచిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ అనుకూల వ్యక్తులే పోటులోకి వెళ్లివస్తుంటారు అని చెప్పారు. అలాకాకుండా ఫలానా ఫలానా వాళ్లు ఆ సమయంలో వచ్చారు అని చెబితే…అక్కడ ఏమి జరిగివుంటుందో అంచనా వేసుకోడానికి ఉపయోగపడుతుంది.

రూ.50 వేల కోట్లు విలువైన శ్రీవారి ఆభరణాలను ఒక రిటైర్డ్‌ ఉద్యోగి చేతుల్లో పెడుతారా? అని ప్రశ్నిస్తున్నారు. అలాకాదు….ఎవరి చేతుల్లో పెట్టారు, ఆయన అర్హతలేమిటి, ఎందుకు పెట్టారు…వంటి అంశాలను నిర్ధిష్టంగా వివరించగలగాలి. పింక్‌ డైమైండ్‌ విషయంలోనూ రమణ దీక్షితులు సరిగా వివరించలేకపోతున్నారు. వజ్రం స్థానంలో రంగిరాయి వచ్చి చేరిందని, ఆ రాయి తరువాత పగిలిపోయిందని, ఒరిజినల్‌ వజ్రం మాయమయిందని ఆయన చెప్పదలచుకున్నారు. అయితే….ఆ క్రమాన్ని సరిగా వివరించలేకున్నారు.

అన్నింటికీ మించి…ఆయన కార్యక్షేత్రం తిరుపతి, తిరుపతి కావాలి. అధికారుల ప్రోద్బలంతో అర్చకులు, పోటు కార్మికులు, జీయంగార్లు, టిటిడి ఉద్యోగులు….వరుసగా రమణ దీక్షితులుపై పలు విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటన్నింటికీ తగిన వివరణలు ఆయన ఇవ్వాలి. ఉదాహరణకు గతంలోనూ రెండు పర్యాయాలు పోటు మరమ్మతులు జరిగాయని, అప్పుడు కూడా సంపంగి ప్రాకారంలోనే నైవేద్యం తయారు చేశామని పోటు కార్మికులు చెబుతున్నారు. దీనిపైన రమణ దీక్షితులు స్పందించాలి. లేకుంటే…రమణ దీక్షితులు చెప్పింది తప్పని…కార్మికులు చెబుతున్నది కరెక్ట్‌ అని భక్తులు నమ్మే అవకాశం ఉంది.

స్థానిక మీడియా టిటిడి అధికారుల గుప్పెట్లో ఉందని, తాను చెప్పే విషయాలు బయటకు రావని రమణ దీక్షితులు గట్టిగా నమ్ముతున్నారు. అందులో పూర్తి వాస్తవం లేదు. అధికారులకు అనుకూలంగా ఒకరిద్దరు ఉండొచ్చు. మీడియా మొత్తం ఆ విధంగా లేదు. రమణ దీక్షితులు చెబుతున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని నమ్ముతున్న పాత్రికేయులూ ఉన్నారు. ఈ అంశం జాతీయ స్థాయికి వెళ్లిపోయిన తరువాత..ఏ మీడియా అయినా రమణ దీక్షితులు చెప్పేదాన్ని దాచిపెట్టే అవకాశం లేదు. ఆయన నిర్భయంగా తిరుపతి, తిరుమలలోనే మీడియాతో మాట్లాడొచ్చు.

ఈ విధంగా నిర్ధిష్టమైన ఆరోపణలతో రమణ దీక్షితులు ప్రజల ముందుకు వెళితే…కచ్చితంగా ఆయనకు మద్దతు లభిస్తుంది. అలాకాకుండా…టిటిడి టిటిడి అనడం వల్ల భక్తుల మనసు నొచ్చుకునే అవకాశాలున్నాయి. అందుకే నిర్ధిష్ట ఆరోపణలు, నిర్ధిష్ట వ్యక్తులపైన, నిర్ధిష్టమైన వివరాలతో చేస్తే రమణ దీక్షితులు పోరాటం తప్పక ఫలిస్తుంది.

2 Comments

  1. మీరు వ్యక్తపరచిన అంశాలు వాస్తవమే. అయితే, వారు ఇలాంటి అంశాల్లో ప్రావీణ్యం ఉన్నవారు కాదు. పకడ్బందీగా ఆరోపణలు చేయడం, నిర్దిష్ట వ్యక్తులపై నిర్దిష్ట ఆరోపణలు చేయడం లాంటివి వారికి అంతగా అలవాటు లేనివి. వారు చెప్పే విధానంలో తొట్రుపాటు ఉన్నా, వారు చెప్పదలచుకొన్నది సూటిగానే ఉంది. ఇక పోరాటం సంగతి, సుబ్రమణ్య స్వామి ఎలాగో కోర్టులో వాదించబోతున్నారు. వారికి ఈ అంశాలపై పూర్తి అవగాహన ఉంది. ఈరోజు దీక్షితులు స్వామిని ఢిల్లీలో కలిశారు. అన్నీ వివరించి ఉంటారు.. కాబట్టి, త్వరలోనే అన్నిటిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. దీక్షితులు ఆంధ్రా లో లేకపోవడమే వారికి సురక్షితం.

  2. In case, he is of difference of opinion with the TTD admin, he is always deserved to bring those issues in board meeting or EO meeting where majority of the responsibility holders attend and he could have drawn the attention, even he would like to gather all archakas in TTD. Even if it is required he would have conducted a press meet in Tirupati rather than going TN for conducting press meet and became a cause of bad propagation against the organisation wherein he himself cam not escape in case something went wrong. Hence, he is not deserved for any kind of symphathy from any one except his misguiders.

Leave a Reply

Your email address will not be published.


*