రమణ దీక్షితులు మళ్లీ ప్రధాన అర్చకులుగా వస్తారా..!

ఆలయాల్లో వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు సంచలనమయింది. ఈ తీర్పు రాష్ట్ర వ్యాపితంగా వేలాది దేవాలయాలపైన ప్రభావం చూపనుంది. అయితే… టిటిడిలో ఈ తీర్పు అమలుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే… తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆలయాల్లో పనిచేసే 65 ఏళ్లు దాటిన అర్చకులను ఇటీవలే తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా తీర్పుతో టిటిడి మల్లగుల్లాలు పడుతోంది.

టిటిడి అధికారులు, పాలక మండలి ముందూవెనుక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్లే….ఇప్పుడు కోర్టు ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. టిటిడికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కోపంతో…శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులను వయో పరిమితి పేరుతో ఆ పదవి నుంచి రాత్రికి రాత్రి తొలగించారు. ఆయన్ను తొలగించారు కాబట్టి…మరి కొంతమంది అర్చకులకు కూడా రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇది అన్యాయమంటూ ఇద్దరు అర్చకులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా…రమణ దీక్షితులు సుప్రీంలో కేసు వేశారు.

తెలుగుదేశం పార్టీకి, బిజెపికి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తి, తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో…అమిత్‌ షా శ్రీవారి ఆలయానికి వచ్చినపుడు రమణ దీక్షితులు….ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు. ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటు తవ్వేశారని, ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి చేరాయి. ఈ ఉదంతానికి కొన్ని రోజుల ముందు….శ్రీవారి ఆలయాన్ని పరిశీలించాలని పురావస్తు శాఖ తీసుకున్న నిర్ణయమూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇంతలోనే అమిత్‌షా వ్యవహారం వచ్చింది. అంతే రెండు రోజుల్లో రమణ దీక్షితులను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. ఇదేమంటే…65 ఏళ్లు దాటిన అర్చకులను రిటైర్‌ చేయాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయాన్నే అమలు చేశామని సమర్థించుకున్నారు.

శ్రీవారి ఆలయంలో దశాబ్దాలపాటు ప్రధాన అర్చకునిగా వున్న రమణ దీక్షితులను తొలగించే ముందు….ఇది చట్ట విరుద్ధమా, చట్టబద్ధమా అనేది కూడా సంబంధిత అధికారులు ఆలోచించలేదు. టిటిడి తీసుకున్న నిర్ణయం న్యాయస్థానం ముందు నిలబడబోదని మొదటి నుంచి ధర్మచక్రం చెబుతూ వస్తోంది. అందుకు తగినట్లుగానే హైకోర్టు తీర్పును వెలువరించింది. చట్టంపై ఉన్న నమ్మకంతోనే తాను మళ్లీ ప్రధాన అర్చక పదవిలోకి వస్తానని రమణ దీక్షితులు గట్టినమ్మకంతో ఉన్నారు. సుప్రీం కోర్టులో ఉన్న దీక్షితులు కేసులోనూ టిటిడికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చునని ఈ వ్యవహారాల గురించి తెలిసినవారు చెబుతున్నారు. దీక్షతులు మళ్లీ ప్రధాన అర్చకునిగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

టిటిడి తీసుకున్న నిర్ణయం…రాష్ట్ర వ్యాపితంగా ప్రభావం చూపింది. అన్ని ఆలయాల్లోనూ 65 ఏళ్లు దాటిన అర్చకులను రిటైర్డ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. హైకోర్టు నిర్ణయంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై టిటిడి సుప్రీం కోర్టులో సవాలు చేస్తోంది. అయినా…ఇది ఒక్క టిటిడికి సంబంధించిన వ్యవహారం కాదు. అన్ని ఆలయాలకు సంబంధించి విషయం. కోర్టు కూడా విశాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే తీర్పునిస్తుంది. ఆ తీర్పు టిటిడికి ఒక విధంగా, చిన్న ఆలయాలకు ఇంకో విధంగా ఉండే అవకాశం లేదు. అందుకే టిటిడికి అప్పీలుకు పోకుండా తీర్పును అమలు చేసివుంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ కేసుకు సంబంధించి కాస్త పరిశీలన చేసినా….ఇందులో టిటిడి నెగ్గే అవకాశాలు తక్కువే అనే సంగతి తెలిసిపోతుంది. ఒకప్పుడు మిరాశీ వ్యవస్థను రద్దు చూస్తూ ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు టిటిడి అర్చకులు సుప్రీంను ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే….ఈ తీర్పును టిటిడి అధికారులు సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. మిరాశీ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే రద్దు చేసింతి తప్ప… వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని రద్దు చేయలేదు. మిరాశీ, వంశపారంపర్య అర్చకత్వం రెండూ ఒకటే అనే విధంగా ఆలోచించడం వల్లే టిటిడి కొందరు అర్చకులను తొలగించింది. అతి తప్పని హైకోర్టు తీర్పుతో స్పష్టమయింది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*