రమణ దీక్షితులు వివాదం రగులుతూనే ఉండాలా!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన తీవ్ర విమర్శలు, ఆరోపణలతో రగులుకున్న వివాదాన్ని చల్లార్చే యోచన ఇటు టిటిడికిగానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికిగానీ ఉన్నట్లు అనిపించంచడం లేదు. టిటిడి తీసుకుంటున్న నిర్ణయాలు ఈ వివాదం మరింత రగులుకునేందుకు దోహదపడేలా ఉన్నాయి తప్ప…సద్దుమణిగేందుకు సహకరించేలా లేవు. ఈనెల 5న తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలతో టిటిడి ప్రతిష్టకు భంగం కలుగుతోందండూ ఆయనపై పరువునష్టం దావా, క్రిమినల్‌ వ్యాజ్యం దాఖలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా టిటిడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికీ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు.

వివాదాన్ని మ‌రింత పెంచ‌డం కాదా?
టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా వివాదాన్ని మరింత రాజేస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవంగా ఇప్పటికే విమర్శలు, ప్రతివిమర్శలతో టిటిడి రోజూ వార్తల్లో ఉంటోంది. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు, వారిలో టిటిడిపై నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. మంచికో చెడుకో రమణ దీక్షితులు విమర్శలు చేయడం, ఆగమేఘాలపై ఆయన్ను తొలగించడం జరిగిపోయాయి. వాస్తవంగా విమర్శలు చేసిన వెంటనే….రమణ దీక్షితులపై వేటు వేయకుండా, ముందూ వెనుక ఆలోచించి, ఆయనకు నోటీసులు ఇచ్చి, సంజాయిషీ అడిగి, క్రమశిక్షణా చర్యలు తీసుకునివుంటే సరిపోయేది. ఈ వివాదం ఇంత పెద్దదయ్యేది కాదు. విమర్శలు చేసిన 24 గంటల్లో ఆయన్ను ప్రధాన అర్చకత్వం నుంచి తొలగించారు. అదే కోపం తీసుకున్న నిర్ణయమని సరిపెట్టుకుందామనుకున్నా…. ఇప్పుడు మళ్లీ అలాంటి పొరపాటు నిర్ణయమే చేశారు. రమణ దీక్షితులపైనే కాకుండా టిటిడిలో జరుగుతున్న వ్యహారాలపై విమర్శలు చేస్తున్నవారందరిపైనా కేసులు పెట్టాలని, లీగల్‌ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే…ఈ వివాదాన్ని మరింతగా పెద్దది చేయడమే. ఇప్పటికే అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు, హిందూసంఘాలు కొన్ని రమణ దీక్షితులుకు మద్దగా ఉన్నాయి. సందు దొరికితే తిరుపతిలో అలజడి సృష్టించాలని చూస్తున్న కొన్ని మతతత్వ సంస్థలకూ టిటిడి దుందుడుకు చర్యలు అనుకోని అవకాశంగా మారుతున్నాయి. టిటిడి వివాదం జాతీయ సమస్యగా మారిపోయింది. ఇప్పుడు కేసులు, నోటీసులంటే మరింతగా దుమారం రేగుతుంది.

మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులపైనా కేసులు పెడ‌తారా?
తాజా నిర్ణయంతో టిటిడిలోని లోపాలను ఎత్తిచూపిన వారందరిపైనా కేసులు పెడతారా? అనే ప్రశ్న ముందుకొస్తోంది. ఇది వాస్తవమే. రమణ దీక్షితులను వ్యక్తిగతంగా విమర్శించేవారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చుగానీ…ఆయన లేవనెత్తిన అంశాలపైన, టిటిడిలో ప్రభుత్వ జోక్యంపైన మాట్లాడుతున్నవాళ్లు అనేకమంది ఉన్నారు. టిటిడి తీసుకున్న అనేక నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలుచేసి స్టేలు తీసుకొచ్చిన శ్రీవారి భక్తులున్నారు. ఇప్పుడు రమణ దీక్షితులుపైనో, ఐవైఆర్‌ కృష్ణారావుపైనో కేసులు పెట్టడమంటే…భవిష్యత్తులో టిటిడి గురించి మాట్లాడే ఎవరిపైనైనా కేసులు పెడతారని అర్థం చేసుకోవాలి. అంతెందుకు చిన్నజీయర్‌ స్వామి, పరిపూర్ణానంద స్వామి, కమలానందస్వామి తదితరులు టిటిడిపై తీవ్రమైన విమర్శలు చేసినవాళ్లు. ఆలయంలో కైంకర్యాలు సరిగా జరడం లేదని గతంతో ఇలాంటి స్వామీజీలంతా ఎత్తిచూపిన వాళ్లే. ఈనెల 9న పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుపతిలో సమావేశమై టిటిడిలోని అపసవ్య ధోరణులపై డిక్లరేషన్‌ ప్రకటించబోతున్నారు. ఇలాంటి వారందరిపైనా కేసులు పెడతారా? నోటీసులు ఇస్తారా? టిటిడి ధార్మిక సంస్థా ? లేక వ్యాపార సంస్థా? ధార్మిక సంస్థ తీసుకునే నిర్ణయాలు ఆధ్యాత్మికతతో కూడి ఉండాలి. ధర్మాధర్మాల విచక్షణతో నిండివుండాలి. టిటిడి ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ మీడియా సమావేశంలో ఒక మాటన్నారు. రమణ దీక్షితులుకు శ్రీవారే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు. దాన్నే నమ్మేట్లుంటే….కేసులు, నోటీసులు ఎందుకు? టిటిడిలోని లోపాలను ఎత్తిచూపేవారిపై కేసులు పెట్టాలనుకోవడం ఏమాత్రం ధర్మం అనిపించుకోదు.

ప్ర‌భుత్వానికి కావాల్సింది ఇదేనా…?
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకోవడం లేదు. రమణ దీక్షితులు వెనుక బిజెపి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. నిజంగా ఉండొచ్చు కూడా. అయితే…వివాదం జాతీయ స్థాయి దాకా రచ్చకెక్కకుండా ఉండేందుకు….ప్రభుత్వమే చొరవ తీసుకుని రమణ దీక్షితులను పిలిచి మాట్లాడొచ్చు. కానీ ఇప్పటిదాకా అటువంటి ప్రయత్నమే జరగలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే…ఈ వివాదం ఇంకా రాజుకోవాలనే భావిస్తున్నట్లు అనిపిస్తుంది. రమణ దీక్షితులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని బిజెపి ప్రయత్నిస్తుంటే….అదే రమణ దీక్షితులు వివాదాన్ని మరింత రగిలించి…ఇప్పటికే బిజెపిపై వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రజలను, టిటిడి వివాదం ద్వారా మరింత వ్యతిరేకతను రెచ్చగొట్టి లబ్ధిపొందాలన్న ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఉన్నట్లు అనుమానించాల్సివస్తోంది. నిజంగా టిటిడి వీధికెక్కకూడదని ముఖ్యమంత్రి భావిస్తే…గంటలో సమస్య పరిష్కరించొచ్చు. ప్రభుత్వమే చొరవ తీసుకుని ఒక కమిటీని నియమించి నిజానిజాలు తేల్చేయవచ్చు. రమణ దీక్షితులను ఆకస్మికంగా తొలగించారన్నా, ఇప్పుడు కేసులు పెట్టాలని నిర్ణయించారన్నా…టిటిడి ధర్మకర్తల మండలి, అధికారులు మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఇంతటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారని అనుకోలేం. ఏమైనా ఎవరి ప్రయోజాల కోసం వాళ్లు శ్రీవారిని, టిటిడిని నిర్భయంగా వాడుకుంటున్నారు. ‘ఎవరికి వారు తాము కరెక్టేనని ప్రజలను నమ్మించవచ్చుగానీ….శ్రీవారిని నమ్మించలేరు. ఎవరి తప్పు ఏమిటో ఆయనకు అన్నీ తెలుసు. తప్పు చేసిన వాళ్లకు ఆయన కోర్టులో శిక్ష తప్పదు’ అనేది శ్రీనివాసుని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*