రమణ దీక్షితులూ…అన్ని పార్టీల నేతలనూ కలుస్తారా?

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలవడాన్ని టిడిపి నాయకులు తప్పుబడుతున్నారు. అదేదో నేరమన్నట్లు బ్రాహ్మణ సంఘాలతోనూ చెప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ‘రమణ దీక్షితులు వెళ్లి జనగ్‌ను కలిశారు. అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి కలయికను చూపించి…ఇదిగో రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ గరుడ’కు ఇదే సాక్ష్యం అని మాట్లాడుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి బిజెపిపైన చెప్పలేనన్ని అనుమానాలున్నాయి. బిజెపి ఏదో విధంగా తనను ఇరుకునపెడుతుందని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీని, ముఖ్యమంత్రిని ఇబ్బందిపెట్టడానికి బిజెపి చేస్తున్న కుట్రలో జగన్‌ మోహన్‌ రెడ్డి, పవన్‌ కూడా కలిసిపోయారని ఆరోపిస్తున్నారు. రమణ దీక్షితులు వెనుక బిజెపి ఉందని మొదటి నుంచి టిడిపి అనుమానిస్తోంది. ఈ క్రమంలో రమణ దీక్షితులు వెళ్లి జనగ్‌ను కలిసే సరికి తమ వాదనలకు బలం చేకూరినట్లుగా భావిస్తున్న దేశం నాయకులు….అదే విషయాన్ని బయటకు చెబుతున్నారు.

రమణ దీక్షితులు చేయాల్సింది ఏమంటే….టిటిడికి సంబంధించి తాను చెబుతున్న అంశాల గురించి రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీలనూ (సిపిఎం, సిపిఐ, జనసే, లోక్‌సత్తా….) కలిసి వివరించాలి. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నట్లు తన వద్ద ఆధారాలుంటే తీసుకెళ్లి నాయకులకు చూపించాలి. తన పోరాటానికి మద్దతివ్వమని అభ్యర్థించాలి. అదేవిధంగా సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఏమిటో కూడా నాయకులకు వివరించాలి. మిగతా విషయాల సంగతి ఎలావున్నా…టిటిడిలో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతోందని ఆయన చెబుతున్న మాటలకు ఆధారాలు చూపించగలిగితే…విచారణ జరిపించాల్సిందేని ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని అడుగుతుంది. టిటిడి వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ఇప్పటికే సిపిఐ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. రమణ దీక్షితులు వెళ్లి మద్దతు కూడగట్టగలిగితే…ఆ పార్టీలూ ఆ దిశగా డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రమణ దీక్షితులు బిజెపితో కలిసి కుట్రలు చేస్తున్నారని అధికార పార్టీ చేసే వాదనలకు బలంవుండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*