రమేష్ కుమార్ ను అభినందించాలా… క్షమాపణ చెప్పాలా..!

కరోనా ముప్పును ముందే ఊహించి స్థానిక ఎన్నికలను వాయిదా వేసినా రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ను అభినందించాలని, ఆయన చర్యలను వ్యతిరేకించిన వారు క్షమాపణలు చెప్పాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాస్తా తర్కబద్ధంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తే రమేష్ కుమార్ నిర్ణయం వెనుక ముందు జాగ్రత్త ఉందో, ప్రభుత్వ కాళ్లకు బందెం వేసే‌ ఆలోచన ఉందో అర్థమవుతుంది.

నిజంగానే రమేష్ కుమార్ కరోనా ఉపద్రవాన్ని ఊహించే ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని అనుకుందాం….చూశాం కదా ఆదివారం నాటి‌ జనతా కర్ఫ్యూ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందో, అదేవిధంగా 31 దాకా లాక్ డౌన్ ప్రకటించడం కోసం ఎన్ని చర్యలు చేపట్టిందో…! ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ అవసరం, పాత్ర గురించి రమేష్ కుమార్ కు తెలియదా.. ! ఎన్నికలు ఆరు వారాలు వాయిదా వేసిన అధికారికి ఎన్నికల నియమావళిని ఎత్తివేయాలని తెలియదా..! ఆయన ఎన్నికల వాయిదాతో పాటు‌ నియమావళిని తొలగించివుంటే… నిజాయితీగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. అలా కాకుండా ఎన్నికలు వాయిదా వేసినా అధికారం తన చేతిలో పెట్డుకోవాలని‌ రమేష్ కుమార్ ఎందుకు అనుకున్నారు. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించకుండా, నియమావళిని‌ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించకుండా ఉంటే…ఇప్పుడు కరోనా నియంత్రణ చర్యలు ఎవరు చేపట్టాలి..? సిఎం చేయాల్సిన పనులను ఆయనే చేస్తారా…!

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా లేవనెత్తిన అంశం కూడా ఇదే. ఎన్నికలు వాయిదా వేసినపుడు కోడ్ ఎలా కొనసాగిస్తారని‌ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ‌అధికారాలను ఎన్నికల‌ సంఘం ఎలా అడ్డుకుంటుందని నిలదేశారు. ఆఖరికి కోర్టు కూడా ఇదే ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేసి కోడ్ కొనసాగించి… ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని భావిస్తున్నారా అ‌ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టులో కూడా ఎన్నికల కోడ్ ఉండాలనే రీతిలోనే ఎన్నికల సంఘం వాదించింది.

ఏ విధంగా చూసినా…రమేష్ కుమార్ పారదర్శకంగా వ్యవహరించలేదు. కరోనా ఉపద్రవాన్ని‌ ఆయన ముందుగా ఊహించివుంటే….ప్రభుత్వ పెద్దలతోనూ, ఉన్నత స్థాయి అధికారులతోనూ చర్చించి వుండేవారు. ఎన్నికల వాయిదా ఉత్తర్వులను‌ ఎన్నికల సంఘం కార్యదర్శికి కూడా తెలియకుండా తయారుచేయించి, జేబులో పెట్టుకొచ్చి మీడియా సమావేశంలో సంతకం పెట్టేవారు కాదు. ఇంత జరిగాక‌ కూడా‌ ఆయన తన నిజాయితీని, నిబద్ధతను చాటుకోలేకపోయారు. కేంద్రానికి‌ ఆయన రాసినట్టు గా చెబుతున్న లేఖపై‌ పెద్ద రాద్దాంతం జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రమేష్ కుమార్ ను అభినందించాలని అనుకునేవారు అభినందించవచ్చుగానీ…ఆయన చర్యలను‌ తప్పుబట్టిన వారు ఆయనకు‌ క్షమాపణ చెప్పాలనడం అర్థరహితం అవుతుంది. ప్రభుత్వమైతే రమేష్ కుమార్ ను అభిశంసించాలని భావిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*