రాఘవులు ప్రశ్నకు జవాబు చెబుతారా బాబూ…!

తెలుగుదేశం పార్టీ కడప ఉక్కు పేరుతో దీక్షలు చేయడం, కేంద్రం నుంచి ఎటువంటి హామీ లభించకనే సిఎం రమేష్‌ దీక్ష విరమించుకోవడం, రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై….సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ పెట్టే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ దీక్షలు ఏ ప్రయోజనాల కోసం అని రాఘవులు ప్రశ్నించారు. పరిశ్రమ పెట్టాలనుకుంటున్నట్లు నాలుగేళ్ల క్రితమే కేంద్రానికి లేఖ రాసివుంటే…అనుమతి ఇచ్చేదీ లేనిదీ తేలిపోయేది కదా అన్నారు. బిజెపితో స్నేహం ఉన్న నాలుగేళ్లు మౌనంగా ఉండటం టిడిపి చేసిన నేరమని అన్నారు.

రాఘవులు లేవనెత్తిన ప్రశ్నల్లో ఔచిత్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ పెట్టదలచుకుంటే…ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేసివుండాలి. కేంద్రం ఏమి చెప్పేదో తేలిపోతుంది. వాస్తవంగా రాయలసీమ వాసులు కడప ఉక్కు కోసం నాలుగేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మాజీ ఎంఎల్‌సి గేయానంద్‌ కడపలో 70 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. జిల్లా మొత్తం ప్రదర్శనలు, దీక్షలు జరిగాయి. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దాదాపు ఏడాది నుంచి రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ మాట్లాడలేదు. కేంద్రం పరిశ్రమ పెట్టకుంటే తామే ఆ పని చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ పేరుతో సిఎం రమేష్‌, బిటెక్‌ రవిలను ఆమరణ దీక్షకు కూర్చోబెట్టారు. బిటెక్‌ రవిని కొన్నిరోజులకే విరమింపజేశారు. కేంద్రం నుంచి చిన్న ప్రకటన కూడా రాకుండానే… ముఖ్యమంత్రి కడపకు వెళ్లి సిఎం రమేష్‌తో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ పెడుతుందని సిఎం ప్రకటించారు. నాలుగేళ్ల నుంచి ప్రయత్నం చేసివుంటే…కడప ఉక్కు కొలిక్కి వచ్చేది. ఎవరైనా విభజన హామీల ప్రస్తావన చేస్తేనే ముఖ్యమంత్రి వారిపై మండిపడుతూ వచ్చారు. ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందంటూ దీక్షలు చేస్తున్నారు. అది కూడా ఎలాంటి హామీ రాకుండానే విరమించారు. ఇది ఏ రాజకీయ ప్రయోజనాల కోసం అని రాఘవులు ప్రశ్నిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*