రాఘవేంద్రరావు స్వామి భక్తి చాటుకున్నారా?

ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశంపై ఈరోజు రాత్రి ఓ టివి ఛానల్‌లో ఆసక్తికర చర్చ సాగింది. ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ ఉద్యమంలో సినీ పరిశ్రమ అంతా మీ వెంట ఉంటుందని హామీ ఇచ్చివచ్చారు. ఇదే ఇప్పుడు సినీ ప్రముఖుల మధ్య వివాదానికి దారితీసింది. ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఒక్కటేనే, వైసిపి, జనసేన, కమ్యూనిస్టులు, వ్యక్తులుగా శ్రీనివాస్‌ వంటివారు చేయడం లేదా? అని ప్రశ్నించారు. జగన్‌ వద్దకు వెళ్లి ఎందుకు మద్దతు ఇవ్వలేదు, సినీ రంగానికే చెందిన పవన్‌ కల్యాణ్‌ ఆందోళన చేస్తుంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదు వంటి ప్రశ్నలు వేశారు ఈ చర్చలో పాల్గొన్న కత్తి మహేష్‌ వంటి వాళ్లు. తమ్మారెడ్డి భరద్వాజ, సంపూర్ణేష్‌బాబు వంటి వాళ్లు గతం నుంచి ఆందోళనలు చేస్తున్నా….ఈ సినీ ప్రముఖలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖకు వెళ్లిన సినీ ప్రముఖులను అరెస్టు చేసినపుడు రాఘవేంద్రరావు, జెమిని కిరణ్‌ వంటి సినీ పెద్దలు కనీసం ఖండించనైనా ఖండించలేదు అని సూటిగా అడిగారు.

ఈ ప్రశ్నలన్నీ సహేతుకంగానే ఉన్నాయనిపించింది. సినీ పరిశ్రమలో అన్ని పార్టీల వాళ్లూ ఉన్నారు. అలాంటప్పుడు…’మా’ (మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌), నిర్మాతల మండలి వంటి సంఘాల తరపున ఉద్యమం చేయాలంటే స్వతంత్రంగా చేయాలి. అవసరమైతే అన్ని పార్టీల వాళ్లు అక్కడికి వచ్చి మాట్లాడి సంఘీభావం ప్రకటించి వెళతారు. అంతేతప్ప అధికార పార్టీ వద్దకు వెళ్లి సినీ పరిశ్రమ అంతా మీ వెంటే ఉందని ప్రకటించడం వల్ల అంతర్గతంగా విభేదాలు తలెత్తాయి. ప్రత్యేక హోదా ఉద్యమంలో సినీ ప్రముఖులు పాల్గొనడం లేదని, వాళ్లకు బాధ్యత లేదని తెలుగుదేశం నాయకుడు రాజేంద్రప్రసాద్‌ విమర్శించినపుడు పోసాని మురళి ఘాటుగానే స్పందించారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం చెప్పుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు నేతృత్వంలో కొందరు సిని పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి మద్దతు ప్రకటించారు. ఈ చర్చలో పాల్గొన్న వాళ్లు చేసిన విమర్శ ఏమంటే…రాఘవేంద్రరావు తొలి నుంచి తెలుగుదేశంతో ఉంటున్నారని, అందువల్లే ఆయనకు టిటిడి బోర్డులో సభ్యత్వం కూడా లభించిందని, ఇప్పుడు ఎస్‌విబిసిలో ఛైర్మన్‌ పదవి చేపట్టబోతున్నారిని అన్నారు. ఇలాంటి ప్రయోజనాలు పొందిన రాఘవేంద్రరావు స్వామిభక్తిని చాటుకునేందుకే సినీ ప్రముఖులు కొందరిని మేనేజ్‌ చేసి సిఎం వద్దకు తీసుకెళ్లారని విమర్శించారు. ఏమైనా భక్తి సినిమాలు తీయడంలో చెయ్యితిరిగిన రాఘవేంద్ర రావు ఈ విధంగా తమ స్వామి భక్తిని చాటుకున్నారన్నమాట. ఇందులో తప్పుబట్టాల్సింది ఏముంది?

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*