రాజధానిపై పచ్చాత్తాపం తప్పదు…పునరాలోచన అవసరం

మూడు పంటలు పండేచోట 32 వేల ఎకరాలను స్వాధీనం చేసుకుని నిర్మిస్తున్న రాజధాని అమరావతిపై భవిష్యత్తులో పచ్చాత్తాపం తప్పదని పలువురు హెచ్చరించారు. అధికార వికేంద్రీకరణపై తిరుపతిలో జరిగిన ఓ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ లక్ష్మణరెడ్డి, మాజీ స్పీకర్‌ అగరాల ఈశ్వర్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు.

నవ్యాంధ్రలో రాజధానికి ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ శివ రామకృష్ణ కమిటీ నివేదికను బుట్టుదాఖలు చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం, ఏకపక్షంగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని చెప్పారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం…సాధ్యాసాధ్యాలను విస్మరిస్తోందని ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. రాజధాని కోసం రూ.50 వేల కోట్లు బాండ్ల రూపంలో సమీకరించాలనుకుంటున్న ప్రభుత్వం….ఆ అప్పును ఏ విధంగా తిరిగి చెల్లిస్తుందని ప్రశ్నించారు. ప్రపంచంలో ఇటువంటి ప్రయోగం ఎక్కడా సఫలం కాలేదన్నారు. జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ…1953నాటి ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ఏర్పాటయిందని, అలాంటప్పుడు అప్పుడు ఏ విధంగానైతే రాయలసీమలో రాజధాని ఉన్నదో…అదే పద్ధతిని ఇప్పుడు పాటించాల్సిదన్నారు. కనీసం హైకోర్టు కూడా సీమలో ఏర్పాటు చేయకపోవడం సీమపట్ల పాలకులకు ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని అచెప్పారు.

ఇంకా మాట్లాడిన వక్తలంతా…ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ప్రభుత్వ పాలనంతా ఒకేచోట కేంద్రీకృతం కావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక్కో మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక్కో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగల అవకాశం ఉందని అన్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందుకు భవిష్యత్తులో పచ్చాత్తాపం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడే పునరాలోచన చేయాలని కోరారు. శివరామ కృష్ణ కమిటీ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*