రాజధాని రైతుల విడ్డూరం…! దేశంలో ఎన్నడూ చూడని వింత ఆందోళన..!!

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని కేంద్రాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. దీనిపై రాజధాని ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం చేయొద్దంటూ గొడవ చేస్తున్నారు. 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అపహాస్యం చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు.

దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు భూసేకరణ చేయడం సహజం. ప్రజా ప్రయోజనాల కోసమే అయినా, పరిహారం చెల్లించినా భూములను వదులు కోవడం రైతుకు బాధగానే ఉంటుంది. అందుకే భూములు ఇచ్చేందుకు ప్రతిఘటిస్తుంటారు. అటువంటి ఆదోళనలు అనేకం చూశాం. కానీ…రాజధాని ప్రాంతంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. గతంలో మీరు ఇచ్చిన భూములు అవసరం లేదు…వెనక్కి ఇచ్చేస్తాం అని ప్రభుత్వం అంటుంటే….తమకు అన్యాయం జరిగిపోతోందంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విచిత్రంగా ఉంది.

తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు పేరుతో రైతుల నుంచి 33 వేల ఎకరాల భూములు సమీకరించింది. భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించి తీసుకోడానికి బదులు సమీకరణ పేరుతో భూములు తీసుకుంది. ఆ భూములను అభివృద్ధి చేసి, కొంత స్థలం ఇస్తామంటూ రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదాకా తీసుకున్న భూమికి ఏటా కౌలు కూడా ఇస్తామని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు భూములు తీసుకున్నప్పటి నుండి 33 వేల ఎకరాలకు కౌలు చెల్లిస్తున్నారు.

రాజధాని ఏర్పాటయితే….చిన్నస్థలమున్నా కోట్ల రూపాయల ధర పలుకుతుందన్న ఆశతో, కౌలు వస్తోందని కనుక రాజధాని ఏర్పాటులో ఎన్నేళ్లు జాప్యం జరిగినా ఇబ్బంది లేదనే భావనతో చాలామంది రైతులు భూములను ప్రభుత్వానికి అప్పగించారు. తీరా ఐదేళ్లు గడిచినా రాజధాని నిర్మాణంలో ఒక అడుగూ ముందుకు పడలేదు. ఇంకో దశాబ్దం గడిచినా అక్కడ మహానగరం ఏర్పాటయ్యే సూచనలేవీ కనిపించలేదు.

ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తామంటూ తెలుగుదేశం ప్రభుత్వం హడావుడి చేసినపుడే…చాలామంది అధ్యంతరం తెలియజేశారు. అభివృద్ధి మొత్తాన్ని ఒకేప్రాంతంలో కేంద్రీకరిస్తే మిగతా ప్రాంతాల్లో అసంతృప్తి పెరుగుతుందని చెప్పారు. తెలంగాణ విడిపోడానికి కారణం ఇదే. అలాంటి నమూనాలోనే అభివృద్ధి జరిగితే రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు రావచ్చన్న హెచ్చరికలనూ చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం భూసేకరణకు నిధులు లేకున్నా ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గొప్పలు చెప్పారు. అందుబాటులో ఉన్న కాస్తాకోస్తో నిధులూ అక్కడే ఖర్చుపెట్టే ప్రయత్నం చేశారు.

ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రాధాన్యతను మార్చుకుంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే తలంపుతో మూడు రాజధానుల ఆలోచనలను ఆచరణలోకి తెచ్చింది. అమరావతి మహానగరం అనే ఆచరణ సాధ్యంకాదని కాన్సెప్ట్‌ను పక్కనపెట్టింది. దీంతో సహజంగానే అమరావతిలో 33 వేల ఎకరాల భూములు అవసరం లేదు. అందుకే ఎవరికి భూములు వారికి ఇచ్చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయుం వల్ల….ఆ రైతులకు (33 వేల ఎకరాలు ఇచ్చినవారికి) నష్టమేమీ లేదు. తమ భూములు తాము తీసుకుని వ్యవసాయం చేసుకోవచ్చు. అయితే….ఏదో అన్యాయం జరిగిపోయినట్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇటువంటి ఆందోళన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదేమో.

కొందరు చేస్తున్న వాదన మరీ విచిత్రంగా ఉంది. భూములు వెనక్కి ఇచ్చేస్తే ఇప్పుడు అందులో వ్యవసాయం చేయడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. సరిహద్దులు గుర్తించడం సాధ్యమవుతుందా అంటున్నారు. ఇవన్నీ అర్థంలేని వాదనలు. ఈ రోజుల్లో సరిహద్దులు గుర్తించడం క్షణాల్లో అయిపోతోంది. శాటిలైట్‌ సర్వే ద్వారా ఏమి భూమి సరిహద్దు ఏమిటో ఇటే తేల్చేయవచ్చు. ఆ విషయానికొస్తే….ఇప్పటికీ ఎక్కువ భూములు యథాతథంగా ఉన్నాయి. పేరుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది గానీ రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. ఇక సమస్య ఏముంది?

ఇక్కడ ఇంకో ప్రధానమైన అంశం కూడా చర్చనీయాంశంగా ఉంది. చిన్న చితక రైతులు ఎప్పుడో తమ భూములను అమ్మేసుకున్నారు. బడాబాబులు, రియల్‌ ఎస్టేటర్లు భూములు కొనుగోలు చేశారు. నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటే భూములు వెనక్కి ఇవ్వడాన్ని ఆహ్వానిస్తారు. ఎంతో సంతోషిస్తారు. పాపం ఆ భూములతో వ్యాపారం చేయాలనుకున్న వారికే ఇప్పుడు ఇబ్బంది.

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

  1. పచ్చని భూములను నాశనం చేసాడు చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published.


*