రాజుగారూ, మీ వెటకారాలకు ప్రభత్వ లెటర్ హెడ్ కావాలా..!

వైసిపి మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసి, క్రమశిక్షణ ఉల్లంఘించి, షొకాజ్ ‌నోటీసు‌ అందుకున్న నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు…నోటీసుకు సమాధానం ఇవ్వకపోగా వెటకారాలకు పోతున్నారు. వైసిపి జాతీయ కార్యదర్శి హోదాలో ఇచ్చిన నోటీసుకు వెటకారంగా సమాధానం ఇచ్చారు.

రఘురామ కృష్ణంరాజు గారు అంగీకరించినా అంగీకరించకున్నా ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పిలుస్తారు. జగన్ స్థాపించి‌న పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అంటారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అని ఉన్న లెటర్ హెడ్ కింద నోటీసు ఇచ్చినందుకు ఎకసెక్కాలు చేసారు. అసలు పార్టీ పేరు‌ తెలుసా…మనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ…మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లెటర్ హెడ్ వెసుకున్నారు…అది ఇంకొకరి పార్టీ…ఈ విధంగా ఇంకొకరి పార్టీ పేరు వాడుకోకూడదు…ఎన్నికల సంఘం కూడా ఇదే చెప్పింది…అంటూ సాయిరెడ్డిని హేళన చేసేలా రాశారు.

తన లేఖ ప్రారంభంలోనే…. రాష్ట్ర పార్టీగా రిజిష్టర్ అయిన ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి‌ అయిన విజయసాయి రెడ్డికి అంటూ మొదలుపెట్టారు. ఇంకా మన పార్టీకి క్రమశిక్షణా సంఘం ఉందా, పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా లేని‌ సంఘం పేరుతో నోటీసులు ఇవ్వడం తప్పు…ఇలా సాంకేతిక పరమైన అంశాలను పట్టుకుని ఎగతాళి సమాధానం ఇచ్చారు.

వెటకారపు లేఖల కోసం..ప్రభుత్వ రాజముద్ర ఉన్న లెటర్ హెడ్ ను రఘురామకృష్ణం రాజు వాడవచ్చా..

రఘురామ రాజు తాను తెలివిగా, వెటకారం దట్టించి సమాధానం ఇచ్చానని సంబరపడొచ్చుగానీ…ఆయన ఎగతాళి చేసింది సాయిరెడ్డిని కాదు. ఆయనకు‌ ఓటేసిన లక్షలాది ఓటర్లని. ఆయన ఎన్నికల ప్రచార పోస్టర్లలో, కరపత్రాల్లో వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అని‌ రాసుకోలేదా..! ప్రచార సభల్లో ఆ పేరు ఉచ్ఛరించలేదా.. !

ఆ మాటకొస్తే…ఆయన రాసిన లేఖను చూస్తే, భారత ప్రభుత్వ రాజముద్ర ఉన్న లెటర్ హెడ్ వినియోగించారు. పార్టీ వ్యవహారాల కోసం అటువంటి లెటర్ హెడ్ ఉపయోగించవచ్చా..! ఇటువంటి‌ సాంకేతిక‌ అంశాలను ఆయన ప్రత్యర్థులూ లేవనెత్తవచ్చు.

లోక్ సభ సభ్యుని స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తన హుందాగా ఉండాలి. అంతేగానీ వెటకారాలు, హేళనలతో ఉండకూడదు. ఇది‌ రాచరికం కాదు. ప్రజాస్వామ్యం. రఘురామ రాజు గుర్తించాలి. – ధర్మచక్రం ప్రతినిధి

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*