రాజు గారు యుద్ధంలో‌ గెలుస్తారా..! ఆత్మాహుతి చేసుకుంటారా..!

యుద్ధం మొదలుపెట్టడం సులభమే. గెలవడమే కష్టం. యుద్ధం ప్రకటించడానికి ముందే తన బల మేమిటో,‌ బలగం ఏమిటో అంచనా వేసుకోవాలి. యుద్ధ క్షేత్రంలోకి వెళ్లాక చూసుకుందాంలే అనుకుంటే తలలు తెగిపడుతాయి. ప్రాణాలు పోతాయి.

నరసాపురం ఎంపి‌ రఘు రామకృష్ణం రాజు…క్షత్రియుడు. ఆయనకు యుద్ధ సూత్రాలు బాగానే తెలిసుండాలి.‌ అయితే..‌.జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజు గారు…ఒంటికన్ను, కుంటి గుర్రం ఎక్కి… మొక్కపోయిన కత్తి తిప్పుతూ ఘీంకరిస్తున్నారా అనిపిస్తుంది.

ఎన్నికలు జరిగి ఏడాదే అయింది. నరసాపురం ఎంపిగా గెలిచిన ఆయన అధిష్టానం మీద తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అప్పుడప్పుడూ చిన్నచిన్న విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన రెండు రోజులుగా…బహిరంగంగానే తీవ్ర విమర్శలకు పూనుకున్నారు. తన కాళ్లావేళ్లాబడితేనే వైసిపిలో చేరి పోటీ చేశానన్నారు. తాను జగన్ వల్ల గెలవలేదన్నారు. తాను కాబట్టే గెలిచానని‌ చెబుతున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని ఎంఎల్ఏలు కూడా తన వల్లే‌ గెలిచారని చెబుతున్నారు.

ఇది వైసిపి‌ శ్రేణులకు‌ ఆగ్రహం తెప్పిస్తోంది. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు రాజు గారి తీరును ఖండించారు. ఇక సోషల్ మీడియా వేదికగా వైసిపి అనుచరులు రాజుపై రగిలిపోతున్నారు. ”మాది నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంమే. నాకు మీరెవ్వరో తెలియదు. నేను మాత్రం జగన్ ను చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసాను. నేనే కాదు మా నియోజకవర్గంలో ఎవ్వరైనా జగన్ ను చూసే ఓటేసారు. కనీసం నువ్వు ఎన్నికల ప్రచారానికి సగం గ్రామాలకే రాలేదు. నిన్ను చూసి ఓట్లు వేసామని ఎలా అనుకుంటున్నావు. పార్టీలోకి రాకముందు నువ్వు ఎవరో కూడా తెలియదు. తెలియకుండా నీకు ఎవడువేస్తాడు ఓటు. పార్టీలో ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే ఏ సైకిలో కమలమో ఎక్కి కూర్చో, మా జుట్టులో ఒక వెంట్రుక ఊడింది అనుకుంటాం…” ఇదీ ఒక నెటిజన్ స్పందన.

ఆయన చెప్పింది సరైనదే.‌ మొన్నటి‌ ఎన్నికల్లో వైసిపి ప్రభజనం వీచింది. అభ్యర్థులను చూడలేదు. ఫ్యాను గుర్తునే చూశారు. ఎంఎల్ఏ‌ అభ్యర్థుల పేర్లు తెలుసు…ఫోటోలు చూశారుగానీ, ఎంపి అభ్యర్థులు ఎవరో 90 శాతం ఓటర్లకు తెలితదంటే‌ ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవాన్ని విస్మరించి, రాజుగారు తన బలాన్ని అతిగా‌ అంచనా వేసుకుని మాట్లాడారా… అనిపిస్తుంది.

మొదటి సారి ఎంపిగా గెలిచిన రఘురామ కృష్ణం రాజుకు సూటి ప్రశ్న…నా పాపులారిటీ వలన నేను గెలిచాను తప్ప వైసీపీ వలన కాదు అంటున్నావు కదా…మరి నీవు వైసీపీ వలన లభించిన ఎంపీ పదవికి రాజకీనామా చేసి గెలువు, అప్పుడు ఒప్పుకుంటాం.‌ నరసాపురంలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థులకు పడిన మొత్తం ఓట్లు 4,60 ,929. ఎంపి గా నీకు వచ్చిన మొత్తం ఓట్లు 4 ,47,594. అంటే నీకు ఎంఎల్ఏ లకు పడిన ఓట్ల కంటే 13 ,335 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చాయి. మరి నీ పాపులారిటీ ఎక్కడుంది? ఇది ఇంకో నెటిజన్ తీసిన లెక్క.

రాజు గారూ..‌.మీ చరిష్మా గురించి చెప్పమంటారా ? మీ సొంత ఊరు ఐ భీమవరంలో మీకు మెజారిటీ వచ్చిందా టిడిపికి వచ్చిందా ? మీ సొంత ఊరిలో టీడీపీకి వచ్చిన మెజారిటీ 1120 ఓట్లు. మీ సొంత మండలం కాళ్ళలో టీడీపీ కి వచ్చిన మెజారిటీ 3 వేలు. మీ సొంత నియోజకవర్గం ఉండిలో టీడీపీకి వచ్చిన మెజారిటీ 11 వేలు. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేవాడివి రాజు గారు ….మిగిలిన అందరూ కలసి మిమ్మల్ని గెలిపించారు. మీకు ఎవరినీ గెలిపించే శక్తీ లేదు…ఇదీ ఇంకో నెటిజన్ చెప్పిన వివరాలు.

రఘు రామకృష్ణం రాజు తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకున్నారని చెప్పేందుకు‌ ఈ గణాంకాలు సరిపోతాయి. అయినా ఆయనెందుకు గర్జిస్తున్నారన్నది ప్రశ్న. తన వెనుక ఉన్న బిజెపిని చూసే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వైసిపి వల్ల గెలవలేదంటున్న మీరు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయండి అని వైసిపి నేతలు సవాలు విసురుతుంటే…మీరూ రాజీనామా చేయండి..నేనూ చేస్తాను. మీరు జగన్ బొమ్మతో పోటీ చేయండి. నేను ఇంకో బొమ్మతో పోటీ చేస్తాను…అని అంటున్నారు రఘురామ రాజు. ఆయన చెబుతున్న ఇంకో బొమ్మ నరేంద్ర మోడీ అనేది బహిరంగ రహస్యం. ఆమాట నేరుగా చెప్పడం లేదు. వైసిపి తనను సస్పెండ్ చేస్తే బిజెపిలో కలిసిపోవాలన్న తహతహ ఆయనలో కనిపిస్తోంది. అయినా ఫ్యాను వల్ల గెలవలేదని చెబుతున్న రఘురామ రాజు రాజీనామా చేసి పోటీ చేయాలి తప్ప… మిగతా ఎంఎల్ఏలూ రాజీనామా చేయాలనడం ఏమాత్రం లాజిక్కు లేని మాట.

తాను అధిష్టానం‌ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేశానని‌ రాజు భావించ వచ్చుగానీ…పార్టీపై తిరుగులేని పట్టుతో ఉన్న జగన్ కు దీనివల్ల జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అన‌నుకూల సమయంలో యుద్ధం ప్రారంభించిన రఘు రామకృష్ణం రాజు…యుద్ధంలో ఓడిపోయి శరణు కోరడంగానీ…ఆత్మార్పణ చేసుకోవడంగానీ చేయడం తప్ప వేరే మార్గం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.

ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*