‘రానా’నా…’నారా’నా!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానటుడు ఎన్‌టిఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్‌టిఆర్‌’ పేరుతో బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. మొదట తేజ అనుకున్నా…సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యాక…తాను ఆ బాధ్యతలు నిర్వర్తించలేనని ఆయన వెనకడుగు వేశారు. ఆ తరువాత క్రిష్‌కు బాధ్యతలు అప్పగింంచారు.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ…తన తండ్రి ఎన్‌టిఆర్‌ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ అంటే ఆయన సీనిమా జీవితంతో పాటు రాజకీయ జీవితమూ ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ జీవితంలో ఆయన అల్లుడు చంద్రబాబు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తరపున తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టిడిపిలో చేరడం, మంత్రిగా పని చేయడం, ఎన్‌టిఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశంతో ఆయన్ను సిఎం పీఠం నుంచి దించడం, తన అల్లుడే తనకు వెన్నుపోటు పొడిచాడని ఎన్‌టిఆర్‌ ఆక్రోశించడం…ఇదంతా చరిత్ర.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….ఎన్‌టిఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడి పాత్రను ప్రముఖ కథానాయకుడు రానా పోషిస్తున్నారు. లీడర్‌తో మొదలుపెట్టి అనేక భిన్నమైన పాత్రలు పోషించిన రానా ఇప్పుడు నారావారి పాత్రలో కనిపించబోతున్నారు. బాహుబలి సినిమా కోసం కండలు పెంచిన రానా….నారా పాత్ర కోసం సన్నబడిపోయారు. సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఎవరో…చంద్రబాబు వేషధారణలోని రానా ఫొటోలను బయటకు తెచ్చారు. ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ ఫొటోలో రానాను చూస్తే…’రానా’నా లేరా ‘నారా’నా అనుకునేంతగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 80వ దశకంలో ఎలావుండేవారో ఆదే రూపులో రానా గెటప్‌ కనిపిస్తోంది. చంద్రబాబు పాత్రలో రానాను చూసి తానే గుర్తుపట్టలేకపోయానని ఆయన తండ్రి, సిర్మాత సురేష్‌బాబు చెప్పారట.

ఒక పాత్రల విషయంలోనే కాదు…కథ విషయంలోనూ ఈ సినిమా ఎంతగానో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుంటే ఎన్‌టిఆర్‌ జీవితంలో వెలుగు జిలుగులు ఎన్నివున్నాయో విషాదమూ అంతేవుంది. ఆయన్ను ముఖ్యమంత్రిగా పదవీచ్చుతున్ని చేసిన తరువాత కుంగిపోయారు. ఆ వేదనలోనే తుదిశ్వాస విడిచారు. నాదేండ్ల భాస్కర్‌రావు మోసం చేసినపుడు ఏ విధంగా జనంలోకి వెళ్లి తన సిఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారో… అదేవిధంగా చంద్రబాబు ఆక్రమించుకున్న (ఎన్‌టిఆర్‌ మాట) పీఠాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని తపనపడ్డారు. అయితే…అంతలోనే ఆయన కన్నుమూశారు. ఇటువంటి అంశాలు సినిమాలో ఉంటాయా, చంద్రబాబు, లక్ష్మీపార్వతి, నాదేండ్లె భాస్కర్‌రావు పాత్రలను ఏ విధంగా చూపించబోతున్నారు అనేదానిపై ఆసక్తివుంది. అయితే…సినిమా ఎక్కడ నుంచి ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తామకు బాగా తెలుసునని బాలకృష్ణ గతంలోనే వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*