రాయపాటిని టిటిడి అలా కూల్‌ చేసిందన్నమాట..!

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు రాయపాటి సాంబశివరావు ఆ మధ్య బోర్డు సమావేశం కోసం తిరుమలకు వచ్చినపుడు….తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై తీవ్ర స్థాయిలో మండపడిన సంగతి తెలిసిందే. ఇక్కడ బోర్డు సభ్యులేకాదు…ఛైర్మన్‌ కూడా డమ్మీయే అంటూ నిరసన గళం వినిపించారు. టిటిడిలో బోర్డు సభ్యుల మాట చెల్లుబాటు కావడ లేదన్నారు. తమను ఖాతరుచేసే నాథుడే లేరని వాపోయారు.

రాయపాటి ఆగ్రహం వెనుక కారణం ఏమిటో ఇటీవలే ధర్మచక్రం బయటపెట్టిన సంగతి తెలిసిందే. టిటిడిలో అందరికీ సుపరిచితులైన మేడసారి మోహన్‌ను అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించాలంటూ రాయపాటి టిటిడి ఈవోకు లేఖ రాశారు. అయితే….వారణాసిలోని బెనారస్‌ హిందూ యూనివర్సీటీ తెలుగు విభాగాధిపతిగా ఉన్న బి.విశ్వనాథ్‌ను నియమించాలని దానికి ముందే చేసిన నిర్ణయానికి టిటిడి కట్టుబడింది. విశ్వనాథ్‌ను నియమించడం వల్ల ఆయనకు యుజిసి స్కేలు కింద నెలకు రూ.2 లక్షల దాకా చెల్లించాల్సివుంటుందని, ఇది టిటిడికి భారమని రాయపాటి చెప్పినా బోర్డు పట్టించుకోలేదు. విశ్వనాథ్‌ నియమకాన్ని ఖరారు చేసింది. ఆ నేపథ్యంలోనే రాయపాటి అంసతృప్తి వెల్లగక్కారు.

రాయపాటిని కూల్‌ చేయడానికి టిటిడి అధికారులు మరో మర్గాన్వేషణ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస వాజ్ఞ్మయ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న తిరుపతికి చెందిన మేడసాని మోహన్‌ పదవి ఈ నెలలో ముగియనుంది. ఆయన్ను అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించడానికి బోర్డు ససేమిరా అనినా…ప్రస్తుతం ఉన్న పదవిలో మరో ఏడాది పొడిగించడానికి 24.07.2018 బోర్డు సమావేశంలో బోర్డు ఆమోద ముద్రవేసింది.

మోడసానికి ఒక ఏడాది పొడిగింపు ఇవ్వడం మాత్రమే కాదు. ఆయన వేతనాన్ని పెంచారు కూడా. రిటైర్డ్‌ అధికారులు చాలామంది టిటిడిలో పని చేస్తున్నారు. ఇటువంటి వారికి వేతనం నిర్ణయించడంలో ఒక సూత్రం ఉంది. ఉద్యోగ విరమణ చేసినపుడు (చివరి నెల) వారు అందుకున్న జీతం నుంచి ప్రస్తుతం వస్తున్న పెన్షన్‌ తీసేయగా మిగిలిన మొత్తాన్ని అగ్రిమెంట్‌ కాలంలో వేతనంగా ఇవ్వడమే ఆ సూత్రం. దాని ప్రకారం మేడసానికి రూ.28,000 వేతనంగా ఇస్తున్నారు. అయితే…రాయపాటి వారి అనుగ్రహం లభించడంతో మేడసానికి రూ.50,000 వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. విశ్వనాథ్‌ను తీసుకొస్తే టిటిడిపై భారం పడుతుందని చెప్పిన రాయపాటికి….ఇది భారంగా అనిపించలేదా అనేదే ప్రశ్న.

2013లో ఉద్యోగ విరమణ చేసిన మేడసాని….కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా పొడిగింపు పొందుతున్నారు. తాజాగా పొడిగింపుతో ఆయన 29.07.2019 దాకా పదవిలో ఉంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*