రాయలసీమపై ఎంత ఘాటు ప్రేమయో…!

వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం, టిడిపి నాయకత్వం, ప్రభుత్వ అనుకూల మీడియా ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అందరూ ముక్తకంఠంతో గగ్గోలుపెడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలపై ఈ మాత్రం ప్రేమ మొదటి నుంచి చూపించివుంటే…ఈ జిల్లాల పరిస్థితి ఎంతోకొంత మెరుగైవుండేది. పుణ్యకాలం అయిపోయిన తరువాత చేస్తున్న హడావుడి వల్ల ఈ ప్రాంతాలకు ఒరిగేదీమీ ఉండదు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణకు వెనుకబడిన జిల్లాల కోసం రూ.450 కోట్లు ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన నిధుల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం నాయకులు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పత్రికలూ ఇదే అంశాన్ని పతాక శీర్షికల్లో ప్రచురించాయి. గత ఏడాది నిధులు రూ.350 కోట్లు, ఈ ఏడాదికి సంబంధించి రూ.350 కోట్లు మొత్తంగా ఏపికి రూ.750 కోట్లు రావాల్సింవుందని, అయినా వివక్షచూపుతున్న కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని నేతలంతా వాపోయారు. వెనుకబడిన జిల్లాలపై ఇంత ప్రేమ చూపుతున్నందుకు అభినందించాల్సిందే. అయితే…ఈ దుస్థితి రావడానికి కారకులెవరనేది కూడా ఒకసారి తమిడి చూసుకోవాల్సిన అవసరం ఉంది.

వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు అనే ప్రశ్నను నాలుగున్నర ఏళ్లపాటు కేంద్రాన్ని అడగలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు వంతున విదిల్చితే…అదే పరమాన్నం అనేట్లు కళ్లకు అద్దుకుని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక ప్యాకేజీ కింద కనీసం 50 వేల కోట్లు ఇవ్వాలని రాయలసీమ ఉద్యమ సంఘాలు తొలి రోజు నుంచి డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. బిజెపితో తెగదెంపులు చేసుకునేదాకా తెలుగుదేశం పార్టీ ఒక్కరోజు కూడా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇన్ని కోట్లు కోవాలని కేంద్రాన్ని కోరిన సందర్భం ఒకటైనా ఉందా అనేది జవాబులేని ప్రశ్నగా ఉంది.

మొదటి ఏడాది జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చినపుడే…కేంద్రాన్ని గట్టిగా నిలదీసివుంటే, ఈ ఏడు జిల్లాల ప్రజలను సమీకరించి ఇప్పటిలాగా ధర్మపోరాట సభలు నిర్వహించివుంటే… తమకు రూ.50 వేల కోట్లు కోవాలని డిమాండ్‌ చేసివుంటే…ఎంతోకొంత మేలు జరిగివుండేది. అప్పుడు బిజెపితో కలిసివున్నారు కాబట్టి…మాటమాత్రంగానైనా వెనుకబడిన జిల్లాల ప్రస్తావన చేయలేదు. ప్రత్యేక హోదాకాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిన సందర్భంలోనూ…అందులో వెనుకబడిన జిల్లాల వాటా ఎంత? అనే ప్రశ్న ప్రభుత్వం నుంచి రాలేదు. అదేవిధంగా సీమ జిల్లాల్లోని పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలనీ విభజనచట్టంలో ఉంది. ఈ నిధులను అడిగిన ఉదంతమూ కనిపించదు. పోలవరంపై పెట్టిన శ్రద్ధ సీమ ప్రాజెక్టులపై చూపలేదు.

కేంద్రం ఏడాదికి రూ.50 కోట్ల వంతున, ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు – మూడేళ్లకు రూ.1050 కోట్లు ఇచ్చింది. నాలుగు, ఐదు ఏడాదుల నిధులు రావాల్సివుంది. వచ్చిన నిధులైనా వెనుకబడిన జిల్లాల్లో ఖర్చు చేశారా? చేసివుంటే దేనికోసం ఖర్చు చేశారు? అనే వివరాలను ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించిన దాఖలాలు లేవు.

ఈ పరిస్జితుల్లో వెనుకబడిన జిల్లాలపై ఎంత ప్రేమ ఒలకబోసినా ఈ ప్రాంతాల ప్రజల్లో విశ్వాసం కల్పించలేరనేది వాస్తవంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనేకాదు…విభజన తరువాత కూడా ఈ ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతూనేవుంది. రాజధాని నిర్ణయం మొదలుకుని సాగునీటి ప్రాజెక్టుల దాకా…అటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర ప్రజలు వివక్షకు గురవుతున్నారు. చిన్నచూపు చూడబడుతున్నారు. అందుకే ఇక్కడ ప్రజల్లో గతంలో ఎన్నడూ లేనంత అలజడి కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*