రాయలసీమ ప్రజలు…బాబుగారికి రతనాల కిరీటం పెట్టాల్సిందే..!

రాయలసీమకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చేస్తున్న వ్యాఖ్యలు సీమ ప్రజలకు, సీమ ఉద్యమకారులకు ఒకింత ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా కియా మోటార్స్‌ కార్లు ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగానూ ఆయన చేసి వ్యాఖ్యలు అతిశయోక్తి కలిగిస్తున్నాయి. రాయలసీమలో కరువును తరిమేశామని, సీమను సస్యశ్యామలం చేశామని ఒకరోజు చెబితే…ఇంకోరోజు రాయలసీమ రతనాల సీమగా మారిపోతోందని అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట ఎండిపోతుంటే…రెయిన్‌ గన్స్‌ తీసుకొచ్చి నీళ్లు పొలాలపై పిచికారి చేసి హడావుడి చేశారు. రెయిన్‌గన్లతో రాయలసీమలో కరువును తరిమేశామని ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆ రెయిన్‌గన్స్‌ ఏమయ్యాయో కూడా తెలియదు. కోట్లు వృథా అయ్యాయి తప్ప రెయిన్స్‌ గన్స్‌ సీమ రైతును ఆదుకున్నది లేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు చేస్తున్న ద్రోహం అంతాఇంతా కాదు. హంద్రీ-నీవా జలాలను చిత్తూరు జిల్లాదాకా తీసుకొచ్చామంటూ హడావుడి చేస్తున్నారు. కాలువ వెంబడి ప్రభుత్వ అధికారులే జలహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాలువలో నీటిని చూసి జనం పరవశులైపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

అయినా…హంద్రీ-నీవా ప్రాజెక్టు కీలక స్వరూపాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మార్చేసింది. వాస్తవంగానైతే….కాలువల ద్వారా పొలలకు నీళ్లు ఇవ్వాలి. పిల్లకాలువలు లేకుండా కేవలం చెరువులు నీళ్లు ఇచ్చి, భూగర్భ జలాలు పెంచడం అనే విధానానికి పరిమితమయింది. ఆచరణలో అదీ జరగడం లేదు. నీటిని కాలువ ద్వారా చివరిదాకా ప్రవహింపజేస్తే చాలనే ధోరణికి వచ్చేసింది. దీన్నే ఆహోఓహో అంటూ ప్రచారం చేస్తున్నారు. కాలువలో సన్నగా నీళ్లుపారితేనే….సీమ సస్యశ్యామలం అయిపోయినట్లు చెప్పారు.

ఇప్పుడు కియా మోటారు కంపెనీ అనంతపురంలో కార్ల తయారీ ప్రారంభించడంతోనే….రాళ్ల సీమ రతనాల సీమ అయిపోయినట్లుగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఒక కంపెనీతోనే రాళ్లసీమ రతనాల సీమ అయిపోతుందా? ఈ మాటకు ఔచిత్యం ఏమైనా ఉందా? ఇక సీమ నుంచి ప్రత్యేకంగా అనంతపురం నుంచి వలసలు ఉండవా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి రోజూ 10 వేల మందికిపైగా పనుల కోసం బెంగళూరుకు వెళుతున్న కూలీలకు ఇక ఆ బాధ ఉండదా? స్థానికంగానే ఉపాధి లభిస్తుందా?

ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ కంటే వెనుకబడిన జిల్లాలు సీమలో ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరమైనా సీమకు న్యాయం జరుగుతుందని ఇక్కడి ప్రజలు భావించారు. రాజధాని సీమలో ఏర్పాటు చేయాలని కోరినవారున్నారు. కనీసం హైకోర్టునైనా ఇక్కడ ఏర్పాటు చేస్తారని ఆశించారు. సీమకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ రావాల్సివుంటే….ఇటీవల దాకా చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కడప ఉక్కు గురించి పట్టించుకోలేదు. గుంతకల్లులో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు విలువేలేకుండాపోయింది. ఇటువంటివన్నీ ఇది సీమ ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. పుండుమీద కారం చల్లిన చందంగా….ఒకటీ రెండు పనులు చేసి రాళ్లసీమను రతనాల సీమగా మార్చేశామని చెబితే…సీమ ప్రజలు నమ్మరు. ఎందుకంటే…చంద్రబాబు నాయుడిలాగా ఇక్కడి ప్రజలూ సీమవాసులే. బాబుకున్న తెలివితేటలు సీమలోని ప్రతిఒక్కరిలోనూ ఉన్నాయి.

1 Comment

  1. చంద్రబాబు కి పూర్తిగా మతి భ్రమించింది

Leave a Reply

Your email address will not be published.


*