రాయ‌ల‌సీమకు నీళ్లు రావాలంటే జ‌గ‌న్ ముందుగా చేయాల్సిందేమంటే…!

గోదావరి జలాలు ఎన్ని వందల టియంసిలు శ్రీ శైలం జలాశయానికి తరలించినా దాని కనీస నీటిమట్టం 854 అడుగులకు అంగీకరించితేనే ఈ ఎత్తిపోతల పథకం ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే గొంతెండి పోతున్న రాయలసీమ దాహార్తి తీర్చే పేరు చెప్పి అమలుకు పూనుకుంటున్న ఈ పథకం ప్రయోజనకారి కావాలంటే సీమకు పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జలాలు తరలించాలంటే నీటి మట్టం 854 అడుగులకు వుంటేనే సాధ్యం అవుతుంది. రెండు రాష్ట్రాలు కూడా లక్షలాది రూపాయలు వ్యయం చేసి పథకం అమలు చేసే సందర్భంలో నీటిని వినియోగించడంలో ఎదురయ్యే సమస్యలను ముందుగా పరిష్కరించు కోవలసి వుండగా ప్రస్తుతం ఆ సూచనలు కనిపించడం లేదు.
రాయల సీమ లో 52 శాసన సభా స్థానాలుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో నమ్మకంతో 49 స్థానాలను కట్ట బెట్టారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ఇప్పటి కిప్పుడే రాయలసీమ గుడి బండగా వున్న 69 జీవో రద్దు చేయ వరసి వుంది. ఈ జీవో రద్దు అయితే తప్ప సీమకు మోక్షం లేదు.
ఈ అంశం ఎందుకింత ప్రాధాన్యత కలిగి వుందంటే శ్రీ శైలం జలాశయం ఎడమ గట్టు నుండి ఇంత వరకు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పై తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా ఆధార పడుతోంది. పైగా మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో పలు ఎత్తిపోతల పథకాలను అమలు చేస్తోంది. వందల కొద్దీ మెగా వాట్ల విద్యుత్ అవసరం. పైగా అతి చౌకగా జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పూర్వ రంగంలో శ్రీ శైలం జలాశయానికి గోదావరి జలాలు తరలించే ముందు రాయలసీమ అవసరాలు తీరే వరకు జలాశయ నీటి మట్టం 854 అడుగులకు నిర్వహించే విధంగా తెలంగాణతో ఒప్పందం చేసుకోవలసి వుంది. కీలకమైన ఈ అంశాన్ని పక్క దారి పట్టించి గోదావరి జలాలు వందల టియంసిలు జలాశయానికి తరలించితే ఏ ప్రయోజనం ఆశించి ఇంత భారీ పథకం అమలుకు పూనుకుంటున్నారో అది నెరవేరే అవకాశాలు ఏ మాత్రం వుండవు.
పైగా ఎపి దిగువ రాష్ట్రం. శ్రీ శైలం జలాశయం ఎగువ భాగంలో తెలంగాణ ఎక్కువ ప్రాజెక్టులను నిర్మించుతోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల సామర్థ్యం కూడా తాజాగా బాగా పెంచింది.
పాలమూరు దిండి ఎత్తిపోతల పథకాలకు గతంలో 120 టియంసిలుగా చెబుతూ వుండి ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి కి 120 టియంసిలు దిండికి 40 టియంసిల అవసరమని చెబుతోంది.
గతంలో కల్వ కుర్తి 25 టియంసిలు సామర్థ్యం వుండగా దాన్ని40 టియంసిలకు పెంచారు. శ్రీ శైలం ఎడమ కాలువ ను30 నుండి 40 టియంసిలకు పెంచారు. ఇలా మొత్తంగా శ్రీ శైలం జలాశయం నుండి తమకు 363 టియంసిల అవసరమని చూపెడుతున్నారు. మరో వేపు ఎపికి కేవలం 194 టియంసిల నీటి అవసరాలను తెలంగాణ ఇంజనీర్లు చూపెడుతున్నారు.
ఈ గణాంకాలు పరిశీలించితే మన కన్నా తెలంగాణకే గోదావరి జలాలు తరలించాలసిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఒక వేళ ఇవన్నీ ప్రక్కన బెట్టినా రాయలసీమ అవసరాలు తీరేంత వరకు జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులు వుండే విధంగా ఒప్పందం జరగాలి. లేకుంటే జలాశయానికి వందల టియంసిల జలాలు తరలించినా దుర్భిక్ష ప్రాంతంమైన రాయల సీమకు ఒరిగేదేమీ లేదు.
అదే సమయంలో ఎపి ప్రభుత్వం మరో జాగ్రత్త తీసుకోవలసి వుంది..
తుంగభద్ర నుండి కెసి కెనాల్ కు కేటాయింపులు వున్న నికర జలాలు నిల్వ చేసుకొనే వెసులు బాటు లేదు. గుండ్రేవుల జలాశయం నిర్మించాలంటే తెలంగాణ భూభాగం కొంత మునక కిందకు వస్తుంది. గోదావరి జలాలు రెండు రాష్ట్రాలు శ్రీ శైలం జలాశయానికి సంయుక్తంగా తరలించే పథకం ఆమోదించే ముందుగా గుండ్రేవుల జలాశయం మునక ప్రాంతం గురించి తెలంగాణ ప్రభుత్వంతో ఎపి ప్రభుత్వం తేల్చుకోవలసివుండి. కీలక మైన ఇతరత్రా అంశాలు ముందుగా తేల్చుకోకుండా గోదావరి జలాలు శ్రీ శైలం తరలించితే చాలని తృప్తి పడితే వాస్తవంలో రాయల సీమకు ఒరిగేదేమీ లేదు.
                                                                                                – వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*