రాష్ట్రంలో ‘చైనా’ వార్‌?

చైనా అంటే కమ్యూనిస్టు చైనా కాదు. మన రాష్ట్రంలో ఒక చైనా ఉంది. చైనా అంటే శ్రీచైతన్య, నారాయణ అని అర్థం. ఇంటర్‌ విద్యలో రాజ్యమేలుతున్న ఈ రెండు సంస్థలు కలిపి కొన్నేళ్ల క్రితం పెట్టుకున్న కొత్త సంస్థ ఇది. శ్రీచైతన్య నుంచి చైని, నారాయణ నుంచి నాను తీసుకుని చైనా అని పేరు పెట్టారు. టాప్‌ ర్యాంకుల కోసం రెండు సంస్థలు ఒకరితో ఒకరు పోటీపడుతుండేవి. ఆ సంస్థలోని విద్యార్థిని ఈ సంస్థ లాక్కొస్తే….ఈ సంస్థలోని విద్యార్థిని ఆ సంస్థ లాక్కెల్లేది. ఈ పరిస్థితుల్లో రెండు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చి….అది ఎంసెట్‌ అయినా, జెఈఈ అయినా ఏదైనా టాప్‌ ర్యాంకులు సాధించగల మెరికల్లాంటి విద్యార్థులను ఎంపిక చేసుకుని ‘చైనా’ బ్యాచ్‌గా ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఫలితాలు వచ్చిన తరువాత ‘చైనా’ పేరుతోనే ప్రకటనలు ఇచ్చేవాళ్లు. ఈసారి ఏమైందోగానీ….ఇక ‘చైనా’ ఉండదని శ్రీచైతన్య యాజమాన్యం ప్రకటించింది. జెఈఈ మెయిన్స్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన వారు తమ విద్యార్థులంటే తమ విద్యార్థులంటూ రెండు సంస్థలూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నాయి. ఇది వివాదాస్పదమయింది. నెల్లూరు విద్యార్థుల తల్లిదండ్రులకు డబ్బులు ఎరవేసి….ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ వారుగా నారాయణ ప్రకటించుకుందని శ్రీచైతన్య ఆరోపించింది. ‘చైనా’ విద్యార్థుల ర్యాంకులను ప్రకటించుకునే హక్కు తమకు ఉందని నారాయణ సంస్థ వెల్లడిచింది. ఇదీ రాష్ట్రంలో చైనా గొడవ.

ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో ఇంటర్‌ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. ఒక సంస్థలో పని చేసే అధ్యాపకులను ఇంకో సంస్థ రాత్రికి రాత్రి కొనేయడం, కిడ్నాప్‌ చేయడం వంటి అనైతిక చర్యలకూ పాల్పడ్డాయి. విద్యార్థులనూ అంతే…ఏదైనా చిన్న సంస్థలో చదవి మంచి మార్కులు సాధిస్తే…రాత్రికి రాత్రి ఆ విద్యార్థిని కొనేసి తమ విద్యార్థిగా ప్రకటించుకున్న ఉదంతాలూ ఉన్నాయి. వేల కోట్ల విద్యా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ఈ సంస్థలు….ఇంకా ఇంకా పోటీపడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక చిన్నా చితకా కాలేజీలను ఇవి ఎప్పుడో కబళించాయి. ఒకప్పుడు కాలేజీలకు కరస్పాండెంట్లుగా పని చేసిన వారు సైతం ఇప్పుడు ఈ రెండు కార్పొరేట్‌ కాలేజీల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు.

ఇక విద్యార్థులను చేర్పించమంటూ అధ్యాపకులను కాల్చుకుతింటున్నారు. మార్చి, ఏప్రిల్‌ వచ్చిందంటూ అధ్యాపకులు ఊర్లపైన తిరగాల్సిన పరిస్థితి. ఒక్కో అధ్యాపకుడు ఇంత మంది విద్యార్థులను చేర్చాలన్న టార్గెట్‌ పెడతారు. ఆ టార్గెట్‌ను చేరుకోకుంటే..ఆ నెల జీతం ఇవ్వరు. ఇంటింటికీ వచ్చి….సామాన్యు అమ్ముకునే సేల్స్‌ రిప్రెజెంటేటివ్‌లాగా…విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వచ్చి, అడ్మిషన్ల కోసం అడుక్కుంటున తీరు చూస్తుంటే…ఎంతో గౌరవ ప్రదమైన అధ్యాపక ఉద్యోగానికి ఈ స్థాయికి దిగజార్చారా…అని ఆవేదన కలుగుతుంది. ఇంత జరుగుతున్నా ఈ కార్పొరేట్‌ భుజగాలను ఏమీ చేయలేని నిస్పహాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా లేని రోజుల్లోనూ తెరవెనుక వుండి ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితి. ఇక ప్రభుత్వాలు చేసేదేముంది? ఏదైనా చేయగలిగితే పౌర సమాజమే చేయాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*