రాష్ట్రం రణరంగం కాబోతోందా? రాష్ట్రపతి పాలన రాబోతోందా?

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. తెలుగుదేశ, బిజెపి మధ్య మొదలైన యుద్ధం రాష్ట్రాని రణరంగంగా మార్చబోతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు (1.05.2018)న తిరుపతిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యతిరేకంగా టిటిపి నేతలు నిరసనకు దిగడం, ఓ బిజెపి నాయకుడి కారు అద్దాన్ని పగలగొట్టడం, బిజెపి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం….ఇవన్నీ చూస్తుంటే, ఈ రెండు పార్టీల మొదలైన రాజకీయ క్రీడలో రాష్ట్రాన్ని పావుగా వాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నాకట ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో తీవ్రమైన పరిణామాలుంటాయని బిజెపి నేతలు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలోనే…తిరుపతి ఘటనలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అంశమూ చర్చకు వస్తోంది. ఓ టివి ఛానల్‌లో బిజెపి నాయకుడు ఒకరు మాట్లాడుతూ…జెడ్‌ కేటగిరీ భద్రత కలిగిన అమిత్‌షా కాన్వయ్‌ వద్దకు టిడిపి కార్యకర్తలు రావడమేగాక…రాళ్లు విసరగలిగారంటే, ఇది శాంతిభద్రతల వైఫల్యంగా పరిగణించాల్సివుంటుందని, రాష్ట్రపతి పాలన విధించడానికి ఇంతకంటే పెద్ద కారణం అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాండిచ్చేరి గవర్నర్‌గా ఉన్న ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తారని ఓ నాయకుడు టివి చర్చల్లో వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఇప్పటికే ఇటువంటి సంకేతాలు ఏవో ఉన్నట్లు తాజా పరిణామాలు విధితం చేస్తున్నాయి. అందుకే అందుకే ఆయన ఇటీవల కాలంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపి తనపై కుట్రలు చేస్తోందని చెబుతున్నారు. ఇదే జరిగితే ప్రజలు వలయంలా ఉండి అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. ఒకప్పుడు ఎన్‌టిఆర్‌ ప్రభుత్వాన్ని రక్షించుకున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని ఆయన మాటల్లో అంతర్యంగా కనిపిస్తోంది. తెలుగుదేశం-బిజెపి మధ్య జరుగుతున్న గొడవలను బిజెపికి, తెలుగు ప్రజలకు మధ్య జరుగుతున్న గొడవలుగా అభివర్ణించడానికి టిడిపి నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై కేసులు బనాయించినా ఆందోళనలు జరుగుతాయి. ఆ విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించే అవకాశాలున్నాయి. అప్పుడు ఆ పేరుతో రాష్ట్రపతి పాలన విధించినా విధించొచ్చు. రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం శాంతిభద్రతలు లోపించినపుడు ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంది. ఇది గతంలో అనేక పర్యాయాలు దుర్వినియోగం అయింది. కేరళలో ఏర్పడిన మొదటి కాంగ్రెస్‌యేతర ప్రభుత్వమైన కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అలాగే రద్దు చేసింది. ఆ తరువాత కూడా అనేక రాష్ట్రాలపై 356ను ప్రయోగించారు.

ఆ ప్రయోగమే రాష్ట్రంపైన జరిగితే తెలుగు ప్రజలంతా ఏకమవ్వాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రత్యేక హోదా అడిగుతున్న తెలుగు ప్రజలపై కుట్రలు చేస్తారా? అని టిడిపి ప్రశ్నిస్తోంది. దీని ఉద్ధేశం భవిష్యత్తులో కేంద్రం నుంచి తనకు వ్యక్తిగతంగాగానీ, పార్టీపరంగాగానీ ఇబ్బంది ఎదురైతే పార్టీతో నిమిత్తం లేకుండా అందరూ ఎదుర్కోవాలన్నది కావచ్చు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. దీనికి టిడిపి కూడా ప్రధాన కారణం. రాష్ట్రంలో రాజకీయంగా స్పష్టమైన విభజన తెచ్చేశారు. ప్రధానంగా టిడిపి, వైసిపి పరంగా జనం చీలిపోయారు. నిజంగా కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలిచే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పాలి. ఇది తెలుగు ప్రజలకు, బిజెపికి మధ్య ఘర్షణ కాదు. ఇది టిడిపికి, బిజెపికి మధ్య వివాదం మాత్రమే. హోదా విషయంలో బిజెపికి ఎంత పాత్రవుందో టిడిపికి కూడా అంతే పాత్రవుంది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసిన వారిని కేసులు పెట్టి జైలుకు పంపిన ఉదంతాలున్నాయి. అవన్నీ ప్రజలకు గుర్తులేదన్నట్లు, తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే బిజెపి తమపై కుట్రులు చేస్తోందని, దీన్ని తెలుగు ప్రజలంతా అడ్డుకోవాలని టిడిపి నాయకలు పిలుపునివ్వడం వల్ల తెలుగు ప్రజలంతా టిడిపితో కలిసి ఉద్యమంలోకి వస్తారనుకోవడం తప్పుడు అంచనానే అవుతుంది. రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చూడాల్సివస్తుందో అనే భయం మాత్రం తెలుగు ప్రజల్లో మొదలయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*