రాహుల్‌…భల్లే పట్టేశాడే..!

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేకున్నా, గవర్నర్‌ సహకారంతో కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప 52 గంటల్లో ఆ పదవిని కోల్పోవాల్సివచ్చింది. సభలో బల నిరూపన చేసుకోలేక, ఓటింగ్‌కు మునుపే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి విషాద వదనంతో వెళ్లిపోయారు. అందరికీ తెలిసిన వార్తేగానీ…ఎవరూ పెద్దగా గమనించని అంశం ఒకటి ఉంది. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే యడ్యూరప్ప తన స్థానం నుంచి బయలుదేరేశారు. దీంతో బిజెపి సభ్యులంతా ఆయన వెంట కదిలారు. ఈ సమయంలోనే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రోటెం స్పీకర్‌ ప్రటించారు. యడ్యూరప్ప సహా బిజెపి సభ్యులంతా సభలో నుంచి వెళుతుండగానే జాతీయ గీతం ఆలాపన మొదలయింది. అయితే యడ్యూరప్ప సహా ఎవరూ నిలబడి జాతీయ గీతానికి గౌరవించలేదు. కాంగ్రెస్‌, జెడిఎస్‌ సభ్యులు మాత్రం నిబలడి జాతీయ గీతాలాపన పూర్తయ్యాక సభ నుంచి వెళ్లారు.

బిజెపి సభ్యులు ప్రవర్తించిన తీరును ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. శాసనసభలో తంతు ముగిసిన కొంత సేపటికి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా ఆయన జాతీయ గీతం విషయాన్నే ప్రస్తావించారు. మీరు గమనించారా…జాతీయ గీతాలాపన జరుగుతుండగా, ఏ మాత్రం గౌరవం లేకుండా ఏ విధంగా సభ నుంచి వెళ్లిపోయారో…అని ఎత్తిచూపారు. దేశ భక్తి గురించి గొంతుచించుకునే బిజెపికి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థపైనా గౌరవం లేదన్నారు. జాతీయ గీతాన్ని గౌరవించకపోవడం బిజెపి సభ్యుల తప్పేగానీ….ఓటమితో కుంగిపోయివున్న వారికి, పాపం జాతీయ గీతం వినిపించివుండదు. ఈ విషయం అర్థంకాక బిజెపిపై రాహుల్‌ విరుచుకుపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*