రాహుల్‌…మోడీని చూసైనా నేర్చుకోవయ్యా బాబూ!

కర్నాటకలో కాంగ్రెస్‌ ఓటమిపాలవడానికి పార్టీ సరైన ఎన్నికల వ్యూహాలను అనుసరించకపోవడమూ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల ఇంజినీరింగ్‌ బిజెపికి తెలిసింతగా కాంగ్రెస్‌ నేర్చుకోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పుడు ఎలాంటి వ్యూహాలను అనుసరించిందో ఇప్పటికీ అదే వ్యూహాలను అనుసరిస్తోంది. సాధ్యమైనంత మంది మిత్రులను కూడగట్టుకోకుంటే బిజెపిని ఓడించడం సాధ్యం కాదనే విషయాన్ని ఆ పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. కర్నాకటలో జెడిఎస్‌తో ఎన్నికల వ్యూహాన్ని రచించివుంటే ఈరోజు బిజెపికి ఏడుస్తూ మూలన కూర్చునివుండేది. జెడిఎస్‌ ఒంటిరిగా అధికారంలోకి రాలేకపోయినా… రాష్రంలో ప్రభావంతంగా ఉంది. ఆ పార్టీకి 40లోపు సీట్లు మాత్రమే వచ్చివుండొచ్చు. కానీ ఆ పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించగలిగేవి ఇంకో 40 స్థానాలు ఉంటాయి. దీన్ని కాంగ్రెస్‌ సరిగా గమనించలేదు. బిజెపి సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకుంది.

బిజెపి తనకు కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన శత్రువు అనుకుంది. అందుకే అందుకు తగినట్లు వ్యూహాన్ని సిద్దం చేసుకుంది. జెడిఎస్‌ను ఎక్కడా తన ప్రత్యర్థిగా బిజెపి చూడలేదు. ఎన్నికల అనంతరం జెడిఎస్‌ అవసరం ఏర్పడవచ్చన్న ముందుచూపుతో…ప్రధాన మంత్రి మోడీ ప్రచార సమయంలోనే దేవేగౌడను దువ్వడం మొదలుపెట్టారు. ఓ విశ్లేషకుడు చెప్పినట్లు ఇప్పటిదాకా మోడీ బయటి పార్టీ వాళ్లను పొగిడిన దాఖలాలు లేవు. ఆ మాటకొస్తే సొంత పార్టీలోనే ఎవరినీ పొగడరు. ఎవరైనా ఆయన్ను పొగడాల్సిందే తప్ప…ఆయను ఇంకొకరిని పొగడరు. అలాంటిది కర్నాకటలో దేవేగౌడపై పొగడ్తల పన్నీరు కురిపించారు. దేవేగౌడ గొప్ప నాయకుడని, ఆయన వయసుకు కూడా కాంగ్రెస్‌ గౌరవం ఇవ్వడం లేదని, తాను అవసరమైతే దేవగౌడ కారు డోరు తీస్తానని…ఎంతో వినయం ప్రదర్శిస్తూ మాట్లాడారు. ఇలాంటి పనిని రాహూల్‌ గాంధీ చేయలేకపోయారు. కర్నాకటలో కాంగ్రెస్‌ గెలిచితీరుతుందన్న గట్టి నమ్మకం రాహుల్‌ గాంధీకి ఉండివుండొచ్చు. అ ధైర్యం నుంచే 2019లో తానే ప్రధాన మంత్రి అవుతానని రాహుల్‌ ప్రకటించివుండొచ్చు. రాహుల్‌ ప్రధాని కావాలంటే….ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పని సరి. ఆ కోణంలో చూసినా…దేవెగౌడతో ఎన్నికల్లో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుని ఉండాల్సింది. బిజెపి ఆ పని చేసింది. కొన్ని స్థానాల్లో బిజెపి, జెడిఎస్‌ ఒకరికొకరు లోపాయికారిగా సహకరించుకున్నారన్న వార్తలొస్తున్నాయి. తాము గెలిచినా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తామన్న నమ్మకాన్ని జెడిఎస్‌కు కలిగించివుంటే…జెడిఎస్‌ కమలంతో అటువంటి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునేది కాదు. ఎందుకంటే కర్నాకట అనేది జీవన్మరణ సమస్య వంటిది. ఈ ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలైవుంటే….దాని ఆత్మస్థైర్యం తీవ్రంగా దెబ్బతినివుండేది. బిజెపి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బదీయడం కోసం అవసరమైతే కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని వదులుకోడానికైనా కాంగ్రెస్‌ సిద్ధపడి ఎన్నికల్లోకి దిగివుంటే…ఇటువంటి పరిస్థితి దాపురించేది కాదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఎదురేలేని మాట వాస్తవమేగానీ…ఇప్పడూ అదే ధోరణితో వెళితే కర్నాటకలో లాగా మూతిపళ్లు రాలిపోవడం ఖాయం. మోడీని చూసైనా రాహుల్‌ గాంధీ ఎన్నికల వ్యూహాలను నేర్చుకుంటారా?!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*