రాహుల్ గాంధీకి ఏమిటా ధైర్యం…!

కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని ఆ మధ్య దాకా అందరూ ఎగతాళి చేసేవారు. ప్రధాని మోడీ అయితే చిన్న పిల్లకాయిని చూసినట్లు చూసేవారు. అయితే…ఇప్పుడు ఆయనలో తెలియని ఉత్తేజం కనిపిస్తోంది. ఉరకలేస్తున్నారు.‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికార పీఠం ఎక్కించగలనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయన ఆత్మవిశ్వాసం ఎంతగా పెరిగిందంటే….వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ జర్నలిస్టులతోనే ఛాలెంజ్ చేసే స్తాయికి పెరిగింది.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ఓ తెలుగు జర్నలిస్టుతో ఈ విధమైన ఛాలెంజ్ చేశారు. రాహుల్ తో తనకు ఎదురయిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు టీవీ 5 ఎగ్జిక్యూటిర్ రావిపాటి విజయ్.

నాతో రాహుల్ గాంధీ బెట్టింగ్….

*************************

ఒక బలమైన షేక్ హ్యాండ్……… ఒక ఛాలెంజ్….. జర్నలిస్టుగా పాతికేళ్ళ ప్రస్ధానాన్ని పూర్తి చేసుకున్నాను. చాలా మంది అగ్ర నేతల ఇంటర్వూలు చేశాను. ఆఫ్ ద రికార్డుగా అంతర్గత విషయాలను కూడా చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు. కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో నాకు విభిన్నమైన అనుభవం ఎదురైంది. రెండు రోజుల తెలంగాణా
రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ మంగళవారం హైదరాబాద్ లోని ది ప్లాజాలో మీడియా ముఖ్యులతో చిట్ చాట్ నిర్వహించారు. టీవీ 5 నుంచి ఎడిటర్ దినేష్ ఆకుల , నేను పాల్గొన్నాం. రాఫెల్ డీల్ సహా అనేక అంశాలపై రాహుల్ మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. యూపీఏ కొనసాగుతుందా లేక కాంగ్రెస్ అధర్వంలో మరో కొత్త అలయెన్స్ ఏర్పాటు చేస్తారా అనే అంశంపై నేను రెండు ప్రశ్నలు అడిగాను. కామన్ మినిమమ్ ప్రోగ్రాం తయారయ్యాక దానిపై నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. సమావేశం ముగుస్తున్న సమయంలో ఆయన నేను కూర్చున్న టేబుల్ వద్దే నిలబడి మాట్లాడుతున్నారు. దాంతో చివరిగా మరో ప్రశ్న కు అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని లోక్ సభ సీట్లు గెలవబోతోంది. అని సూటిగా అడిగాను. దాంతో ఆయన నా వంక అదోవిధంగా చూశారు. మేం గెలుస్తాం అన్నారు. నేను మళ్ళీ వంద సీట్లపైన వస్తాయా , రెండు వందల మార్కు దాటతారా అని అడిగాను. దాంతో ఆయన నాకు దగ్గిరగా వచ్చారు. 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
మేం గెలుస్తున్నాం అన్నారు. అయితే… నా వంక చూసిన ఆయన, నేను నమ్మడంలేదని భావించారు. నా చేతిలో చెయ్యివేసి అలాగే గట్టిగా పట్టుకున్నారు. చలో బెట్ కడదాం. కాంగ్రెస్ అధికారంలో వస్తుందని నా బెట్. ఎంత బెట్ చేస్తావో చెప్పు అన్నారు. నేను ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనయ్యాను. వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. ఆయన మళ్ళీ రెట్టించి అడిగారు. నేను తేరుకుని కాంగ్రెస్ అధ్యక్షులు మీరు, మీరే చెప్పండి. ఎంత బెట్ అన్నాను. కానీ ఆయన పట్టు వీడలేదు. నా చేయి వదలలేదు. నో ఎంత బెట్ నువ్వే చెప్పాలి అని పట్టుబట్టారు. చుట్టూ వందమందికిపైగా మీడియా ప్రముఖులు, కాంగ్రెస్ అగ్రనేతలు.. దాంతో నాకు ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. ఇష్యూని అంతటితో వదిలేద్దామా అంటే రాహుల్ నా చేతిలో చెయ్యి వేసి బలంగా అలాగే పట్టుకుని ఉన్నారు. వెంటనే అన్నాను. ఈ బెట్టింగ్ లో మీరు గెలిస్తే టీవీ 5 ప్రతినిదిగా నాకు ఇంటర్వూ ఇవ్వండి అని అడిగాను. ఆయన డన్ అంటూ తప్పకుండా ఇస్తానని చెప్పి అప్పుడుగాని నా చేయి వదలేదు. మా బెట్టింగ్ లో రాహుల్ గెలవడం అంటే ఆయన ప్రధాని కావడం. రాహుల్ కు నాకు మధ్య బెట్టింగ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు ఆ హాల్ లోని ముఖ్యులంతా చాలా ఆసక్తిగా తిలకించడం, ఆలకించడం పాతికేళ్ళ నా జర్నలిస్టు జీవితంలో గొప్ప అనుభూతి. చివర్లో రాహుల్ మీటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయే సమయంలో మరోసారి ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకుని మరోసారి మా ఛానల్ టీవీ 5 అని చెప్పి ఇంటర్వూ సంగతి గుర్తు చేశాను. తప్పకుండా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. చాలా మంది నేతలతో పలు రకాల అనుభావాలెదురవుతుంటాయి. కానీ ఇది మాత్రం నాకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోదగ్గ అనుభవమే. రాహుల్ నాకిచ్చిన షేక్ హ్యాండ్ నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.
తన ఛాలెంజ్ ని రాహుల్ గుర్తుంచుకుంటారని, మోడీని ఢీకొట్టి ప్రధాని అయితే ఆయన టీవీ 5 ప్రతినిధిగా నాకు ఇంటర్వూ ఇస్తారని నమ్ముతూ…. గుడ్ లక్ రాహుల్ జీ…..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*