రుణ యూనిట్లు తక్కువ…ఆశావహులు ఎక్కువ

  • కార్పొరేషన్ రుణాల కోసం కిక్కిరించిన ఎంపిడివో కార్యాలయం

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రుణాలు కోసం వేల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నప్పటీ పదుల సంఖ్యలో మాత్రమే యూనిట్లు కేటాయించడం; గ్రామానికి రెండు, మూడు కూడా వచ్చే అవకాశాలు కనిపించకపోవడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం శ్రీకాళహస్తి ఎంపిడివో కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూ కు వందల సంఖ్యలో నిరుద్యోగులు హాజరు కావడం చర్చానీయాంశంగా మారింది.

యూనిట్లు తక్కువ.. నిరుద్యోగులు ఎక్కువ.
శ్రీకాళహస్తి ఎంపిడివో కార్యాలయంలో బుధవారం జరిగిన సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూ కు వందల మంది హాజరయ్యారు. ఈ మండలంలో లబ్ధిదారుల ఎంపిక కోసం ఎగువవీధి సప్తగిరి గ్రామీణ బ్యాంకు, శ్రీకాళహస్తి గ్రామీణ బ్యాంకు, ఎడిబి బ్యాంకు తదితర బ్యాంకుల అధికారులు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. వాస్తవానికి ఈ మండలం లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి అన్ని బ్యాంకు లకు కలిపి కేవలం 70 యూనిట్లు మాత్రమే కేటాయించగా…వీటికోసం 1468 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఎస్టీ కార్పొరేషన్ కు సంబంధించి 35 యూనిట్లు కేటాయించగా ఇందుకోసం 444 మంది దరఖాస్తు చేసుకున్నారు. బిసి కార్పొరేషన్ కింద 28 రుణాలకు గాను 678 మంది, ఆర్థికంగా వెనుకబడిన వారికి 3 యూనిట్ లకుగాను 12 మంది వచ్చారు.


అత్యధికంగా వెనుకబడిన వర్గాలకు1యూనిట్ కు గాను 24 మంది, కాపు కార్పోరేషన్ కు సంబంధించి 78 యూనిట్ లకు గాను119 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఒక యూనిట్ కు దాదాపు 21మంది పోటీపడుతుండటంతో ఎవరికి వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఈ కార్పొరేషన్ కు సంబంధించి 70 యూనిట్ లు మాత్రమే ఉండటంతో ఒక్కో బ్యాంకు కు సుమారు 20 యూనిట్ లు మాత్రమే కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఎగువవీధి సప్తగిరి గ్రామీణ బ్యాంకు పరిధిలో సుమారు 20 గ్రామాల వరకు ఉంటున్నాయి. ఒక్కో గ్రామం నుంచి 20, 30 మంది రుణాలు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నట్లు సమాచారం. ఒక్క అమ్మపాళ్యెం గ్రామం నుంచే దాదాపు 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఎగువ వీధి గ్రామీణ బ్యాంకు అన్నిగ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా గ్రామానికి ఒకటికి మించి ఇచ్చే పరిస్థితి లేకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

రాజకీయ నేతలకూ తలనొప్పే…
శ్రీకాళహస్తి మండలంలో సబ్సిడీ రుణాల లబ్దిదారుల ఎంపిక తలనొప్పిగా మారుతోంది. గత ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామం నుంచి అనేక మంది యువకులు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ప్రస్తుతం వీరంతా రుణాలు కోసం దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూ కు హాజరయ్యారు కూడా. అయితే గ్రామానికి ఒకటి రెండు యూనిట్ లుమాత్రమే కేటాయించడంతో ఎవరికి ఇప్పించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఈ ప్రభావం ఎలా ఉంటుందోఅని మధనపడుతున్నారు. కొందరు నేతలయితే ఈవ్యవహారమే తమకు వద్దని దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ఎంపిడిఓ బాలాజీ నాయక్

డిసెంబర్ లో లబ్ధిదారుల ఎంపిక…
శ్రీకాళహస్తి మండలంలో సబ్సిడీ రుణాల లబ్దిదారుల ఎంపిక డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఎంపిడిఓ బాలాజీ నాయక్ తెలిపారు. ఆయన ధర్మచక్రం తో మాట్లాడుతూ స్పెషలాఫీసర్, ఎంపిడిఓ, బ్యాంకు అధికారులు ముగ్గురు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15కల్లా ఆయా బ్యాంకు లకు ఎంపిక కాబడిన లబ్ధిదారుల జాబితా పంపుతామని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*