రూటు మార్చిన బ్రహ్మానందం…!

రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై నవ్వులు పూయించి కామెడీ కింగ్‌గా వెలుగొందిన బ్రహ్మానందం ఇప్పుడు బుల్లితెరపై తలుక్కుమంటున్నారు. స్టార్‌ మా టివిలో ఈ శనివారం నుంచి మొదలైన లాఫ్టర్‌ ఛాలెంజ్‌ అనే ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం నట జీవితంలో ఇదో కొత్త మలుపు.

తెలుగు సినిమాలో హాస్యపాత్రలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారిన బ్రహ్మానందం….వందలాది సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవించారు. ఆయన నటించాల్సిన అవసరం లేదు…తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో నవ్వుల జల్లు కురుస్తుంది. అయితే…ఒకేరకమైన పాత్రులు చేసిచేసి ప్రేక్షకులకే కాదు…బ్రహ్మానందానికీ విసుకొచ్చింది. అందుకే ఆయన మెల్లగా సినిమాలు చేయడం తగ్గించేశారు. ఇదే సమయంలో తెలుగు తెరకు అనేక మంది కొత్త హాస్య నటులు అందివచ్చారు. టివి ఛానళ్ల రియాలిటీ షోలతో లెక్కకు మించిన హాస్య నటులు పరిచయం అయ్యారు. ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే తెలుగు సినిమా లేదనే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

తెలుగు సినిమాకు పరిచయమైనది మొదలు నిర్విరామంగా పని చేసిన బ్రహ్మానందం…ఇప్పుడు కాస్త విశ్రాంతి కోరుకుంటున్నట్లు ఆయన ఇంటర్వ్యూలను గమనించిన వారికి అర్థమవుతుంది. అలాగని పూర్తికాలం ఖాళీగా ఉండలేరు. అందుకే…ఆయన బుల్లితెరపై దృష్టిసారించినట్లున్నారు. స్టార్‌ మాలో శని, ఆదివారాల్లో ప్రసారం కానున్న గ్రేట్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ – హాస్య ప్రధానమైన కార్యక్రమానికి న్యాయ నిర్తేత బాధ్యతలు చేపట్టారు.

ఈ శనివారం మొదటి ఎపిషోడ్‌ ప్రసారమయింది. తెలుగు రాష్ట్రాల్లోని మెమెక్రీ అర్టిస్టులతో హాస్యం పండించడానికి రూపొందిస్తున్న ఈ షో వంటివి ఇతర ఛానళ్లలోనూ వచ్చాయి. అయితే…బ్రహ్మానందం జడ్జి కావడం ప్రస్తుత షోకు ప్రత్యేక ఆకర్షణ. బిగ్‌బాస్‌ తేజస్వీ యాంకర్‌ చేస్తున్న ఈ షో ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. రానున్న కాలంలో బ్రహ్మానందం బుల్లితెరపై బిజీ కాబోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*