రేషన్ డీలర్లు, లబ్దిదారులకు కరోనా భయం..!

  • అందుబాటులో లేని శానిటైజ్ లు, మాస్కులు
    బయోమెట్రిక్ ద్వారా వ్యాధిసోకే అవకాశం..?


ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
ప్రపంచం తోపాటు దేశాన్ని ,రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా భయం ప్రస్తుతం రేషన్ తీసుకుంటున్న లబ్దిదారులకు, డీలర్లు పట్టుకుంది. మనిషికి మనిషికి దూరం ఉండాలని చెబుతున్నప్పటికీ రేషన్ షాపుల వద్ద మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఎలాంటి శానిటైజ్ లు వాడకనే ఒకరు తరువాత ఒకరు బయోమెట్రిక్ లో వేలిముద్రలు వేస్తుండటం వలన కరోనా వచ్చే అవకాశం ఉందని రేషన్ లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రతి డీలర్ కు శానిటైజ్ లు ఇచ్చామని చెబుతున్నప్పటికీ ఈ నెల ఏడీలర్ కు శానిటైజ్ లు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రేషన్ లబ్ధిదారులకు కరోనా భయం.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేషన్ తీసుకుంటున్న లబ్దిదారులకు కరోనా వ్యాధి భయం పట్టుకుంటోంది. గత రెండు వారాల క్రితం రేషన్ సరుకులు తీసుకునేందుకు విఆర్వో లు ఒక్కరే బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి లబ్దిదారులకు నేరుగా సరుకులు అందజేశారు. తద్వారా లబ్దిదారులు బయోమెట్రిక్ తో సంబంధం లేకుండా నేరుగా సరుకులు తీసుకున్నారు. ఈ విధానం వలన మనిషికి మనిషి సంబంధం లేకుండా రేషన్ తీసుకోగలిగారు. కరోనా గురించి ఎలాంటి బెంగ పడలేదు. అయితే విఆర్వో ఒక్కరే వేలిముద్రలు వేసి సరుకులు ఇవ్వడం వలన కొంత అవకతవకలు జరిగాయనే విమర్శలున్నాయి. ఈ నేపధ్యంలో స్పందించిన ప్రభుత్వం తాజాగా రేషన్ సరుకులు తీసుకోవాలంటే లబ్దిదారుల వేలిముద్రలు తప్పనిసరి చేసింది. ఒకరినుంచి మరొకరికి కరోనా సోకకుండా ఉండేందుకు గాను రేషన్ షాపుల వద్ద శానిటైజ్ లు ,మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అత్యధిక రేషన్ షాపుల వద్ద శానిటైజ్ లు ,మాస్కులు కనిపించడంలేదు. రేషన్ షాపుల వద్ద క్యూలో దూరం దూరంగా నిలబడుతున్న లబ్దిదారులు బయోమెట్రిక్ దగ్గరకు వచ్చే సరిగా ఒకరి తరువాత మరొకరు వరుసగా వేలిముద్రలు వేస్తున్నారు. ఒకరు వేలిముద్ర వేసిన తరువాత ఎలాంటి శానిటైజ్ వాడకనే మరొకరు వేలిముద్ర వేస్తున్నారు . ఈ విధానం వలన పొరపాటున ఎవరైనా కరోన సోకిన వారు వేలిముద్ర వేస్తే ఆ ప్రభావం రేషన్ డీలర్లు తో పాటు లబ్దిదారులకు వ్యాధిసోకే ప్రమాదముండటంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా అధికారులు, నేతలు పడుతున్న శ్రమకు తూట్లు పొడిసే అవకాశం ఉంటుంది.

ఎలాంటి శానిటైజ్ లు ఇవ్వలేదు..రేషన్ డీలర్లు
రేషన్ షాపుల్లో ఉపయోగించే బయోమెట్రిక్, లబ్దిదారులకు ఉపయోగించేందుకు తమకు ఎలాంటి శానిటైజ్ లుగాని , మాస్కులు గాని ఈ సారి ఇవ్వలేదని పలువురు రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. గత రేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఓ వందగ్రాముల శానిటైజ్ బాటల్లో ఇచ్చారని అది అప్పుడే సరిపోలేదన్నారు. ప్రస్తుతం శానిటైజ్ ఉపయోగించకుండా వరుసగా వేలిముద్రలు వేస్తుండటం వలన లబ్దిదారులేకాదు తాము ఆందోళన చెందుతున్నట్లు పలువురు డీలర్లు వాపోయారు.
డీలర్లందరికీ శానిటైజ్ లు పంపిణీ. తహశీల్దార్
రేషన్ షాపుల్లో ఉపయోగించే బయోమెట్రిక్ లో వాడేందుకు డీలర్లందరికీ శానిటైజ్ లు ,మాస్కులు పంపిణీ చేశారని శ్రీకాళహస్తి తహశీల్దార్ జరీనా బేగం తెలిపారు. శానిటైజ్ లు ఇవ్వలేదనడంలో వాస్తవం లేదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*