రౌడీ ముఖ్యమంత్రి విజయ్‌ దేవరకొండ! ‘నోటా’ సినిమా స‌మీక్ష‌

వరుస విజయాలతో జోరుమీదున్న విజయ్‌ దేవరకొండ హీరోగా, ద్విభాషా చిత్రంగా ఈ శుక్రవారం విడుదలైన ‘నోటా’ నేటి కలుషిత రాజకీయాలపై ఎక్కుపెట్టిన అస్త్రం. రాజకీయాలు ప్రక్షాళన కావాలని ఆశిస్తూ తీసిన పొలిటికల్‌ డ్రామా. నోటాలో అక్కడక్కడా తడబాబు కనిపిస్తున్నా ఓవరాల్‌గా చూసినపుడు ఒకసారి చూడదగ్గ సినిమానే. తమిళనాడు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని రాసుకున్న ఈ కథ….తెలుగు ప్రేక్షకులకంటే తమిళులకు బాగా నచ్చే అవకాశముంది.

వరుణ్‌ (విజయ్‌ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్‌ (నాజర్‌) కుమారుడు. ఎక్కడో లండన్‌లో ఉంటూ అప్పడప్పుడూ వచ్చివెళుతుంటాడు. రాజకీయాలంటే అసలు ఆసక్తిలేని వరుణ్‌ అనుకోని పరిస్థితుల్లో ఎంసి అవుతాడు. ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రికి ఓ అవినీతి కేసులు శిక్షపడే పరిస్థితి వచ్చినపుడు….తాత్కాలికంగా రెండు వారాల పాటు సిఎంగా ఉండమని ఆ సీట్లో కూర్చోబెడతారు. అయితే….వాసుదేవ్‌ బ్లాక్‌మనీ వ్యవహారాలను చూసే ఆ డబ్బులను నొక్కేయడానికి సిఎంపై హత్యాయత్నం చేయడం, దీంతో ఆయన కోమాలోకి వెళ్లడం, ఈలోపు జరిగే రాజకీయ పరిణామాలను చూసి చలించిన వరుణ్‌…రాజకీయల్లో, పాలనలో మార్పు తీసుకురావడాని పూనుకోవడం, ఆఖర్లో వాసుదేవ్‌ కోమాలో నుంచి బయటకు రావడం, కొడుకుని ఆ పదవి నుంచి తొలగించాలని ప్రయత్నించడం….ఇది కథ. ముఖ్యమంత్రిగా వరుణ్‌ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల మన్ననలు ఎలా పొందుతాడు, ఈ కథ ఎలా సుఖాంతం అవుతుంది అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ముందే చెప్పినట్లు ఇది తమిళనాడు రాజీకీయ పరిణామాలను గమనంలో ఉంచుకుని సిద్ధం చేసుకున్న కథ. అక్కడ ఎంఎల్‌ఏలు ముఖ్యమంత్రి ముందు ఎంతగా వొంగివొంగి ఉంటారో అనేక సార్లు పత్రికల్లోనూ, టివిల్లోనూ చూశాం. దాన్ని సెటైరికల్‌గా నోటాలో చూపించారు. ‘నా ముఖం సరిగా చూడండి…రేపు నా శిలా విగ్రహం పెట్టాల్సినపుడు…మీ ముఖం ఎప్పుడూ సరిగా చూడలేని అంటారు’, ‘రాజకీయాల్లోకి వచ్చాక పంచె గట్టిగా కట్టుకోవాలి. లేకుంటే గుంజిపారేస్తారు’ వంటి సెటైరికల్‌ డైలాగులు నేటి రాజకీయ దురవస్థను తెలియజేస్తాయి. యువతను విశ్వాసంలోకి తీసుకోవాలని, వారే దేశ రాజకీయాలను మార్చగలరన్న సందేశం ఇస్తుంది నోటా.

ఇక విజయ్‌ దేవరకొండను చూపించగానే…అతను బర్త్‌డే పార్టీలో ఫ్రెండ్స్‌తో మందుకొడుతూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని రాత్రికి రాత్రి సిఎం చేస్తారు. ఈ సందర్భంగా అధికార పార్టీ కార్యకర్తల దాడులు, సొంత పార్టీవారైనా అరెస్టు చేయించి ఘర్షణలను అణచివేయడం…తదితర మొదటి భాగంలో వచ్చే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు ఆనంద్‌ శంకర్‌. రెండో భాగంలోనే కాస్త తటబాటుకు గురయ్యాడు. అనూహ్య మలుపులు చూపించాలనుకున్నా అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యమంత్రి రహస్య ప్రదేశానికి వెళ్లి దాక్కోవడం వంటి లాజిక్‌కు అందని సన్నివేశాలు ఉన్నాయి. అదేవిధంగా జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న మహేంద్ర (సత్యరాజ్‌)కు సంబంధించి చెప్పిన ప్రేమకథ ఫ్లాష్‌బ్యాక్‌ అంతగా ఆకట్టుకోదు. అనవసరమైన ట్విస్ట్‌ల జోలికి వెళ్లకుండా…మొదటి భాగంలాగే రెండో భాగాన్నీ తెరకెక్కించివుంటే, ఇంకొన్ని రాజకీయ ఉదంతాలను ఇమిడ్చివుంటే… సినిమా సూపర్బ్‌ అనిపించుకునేది.

ఇక నటన విషయానికొస్తే…విజయ్‌ దేవరకొండ రౌడీ ముఖ్యమంత్రిగా పూర్తిగా ఒదిగిపోయాడు. తనదైన నటనతో నూటికి నూరు మార్కులూ కొట్టేశాడు. నాజర్‌, సత్యరాజ్‌ తమ పాత్రకు దగిన నటనతో ఆకట్టుకుంటారు. ఇక హీరోయిన్‌ మెహరీన్‌ ఉన్నా లేనట్లే. ఆమెకు చెప్పకోదగ్గ పాత్ర ఏమీలేదు. ఈ సినిమాకు ‘నోటా’ అని పేరు పెట్టడంపై విమర్శలు వచ్చినా, ఈ చిత్రం ఒక పార్టీకి అనుకూలంగా ఉందని కొందరు ఆరోపణలు చేసినా…అటువంటి వాటికి ఆధారాలు ఎక్కడా కనిపించవు. ఆ మాటకొస్తే నోటా అనే పేరే ఎక్కడా వినిపించదు. ఓ సన్నివేశంలో…ఓటింగ్‌ మిషన్‌పైన చివర్లో ‘నోటా’ అని కనిపిస్తుంది. కలుషత రాజకీయాలు చేస్తున్న నేతలను ఎన్నుకోవద్దని చెప్పడమే నోటా అని పేరు పెట్టడంలోని ఉద్దేశం అని అనుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*