ర‌మ‌ణ దీక్షితులుపై మీడియా గుర్రు

టిటిడికి సంబంధించి, శ్రీ‌వారి ఆల‌యానికి సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసిన శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు…..ఆ విష‌యాలు వెల్ల‌డించ‌డానికి చెన్న‌యికి వెళ్లి మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డంపై తిరుప‌తి, తిరుమ‌ల మీడియా ప్ర‌తినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్థానికి మీడియా తాను చెప్పే విష‌యాల‌ను రాస్తుంద‌న్న న‌మ్మ‌కం లేక‌పోవ‌డం వ‌ల్లే చెన్న‌యిలో మీడియా  స‌మావేశం నిర్వ‌హించాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న చేసిన వాఖ్య‌ల‌పై ఇక్క‌డి మీడియా ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు.  ర‌మ‌ణ దీక్షితులు  గురించి అన్ని విష‌యాలూ స్థానిక మీడియాకు తెలుసున‌ని, అవ‌న్నీ అడుగుతార‌న్న భ‌యంతోనే ఆయ‌న చెన్న‌యి, అమ‌రావ‌తి వెళ్లి మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తుంటార‌ని ఎద్దేవా చేస్తున్నారు. ఆయ‌న‌కు స‌మ‌స్య వ‌చ్చ‌న‌పుడు మాత్ర‌మే శ్రీ‌వారు, కైంక‌ర్యాలు, నిబంధ‌న‌లు అన్నీ గుర్తుకొస్తాయ‌ని అంటున్నారు. ఆల‌యంలో మిరాశీ వ్యవ‌స్థ ర‌ద్ద‌యి ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ….మిరాశీ వ్య‌వ‌స్థను కొన‌గించ‌డానికి దీక్షితులు  ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. కొంద‌రు అర్చకులు త‌మ పిల్ల‌ల‌ను అర్చ‌కులుగా టిటిడిలో ప్ర‌వేశ‌పెట్టేందుకు  ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, దీనికి టిటిడి ఆమోద ముద్ర వేయ‌డం లేద‌ని, అందుకే ర‌మ‌ణ దీక్షితులు టిటిడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని మీడియా  ప్ర‌తినిధులే చెబుతున్నారు. రెండు వేల స‌వ‌త్స‌రాలుగా శ్రీ‌వారి ఆల‌యాన్ని కాపాడుతున్నామ‌ని ర‌మ‌ణ దీక్షితులు చెప్ప‌డంపైనా అభ్యంత‌రం  వ్య‌క్తం చేస్తున్నారు. రెండు వేల సంవ‌త్స‌రాల క్రితం మీ కుటుంబాలు  ఎక్క‌డున్నాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తిరుప‌తిలో మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌కుండానే, తాను చెప్పే విష‌యాలు రాయ‌ర‌ని ఆరోపించ‌డం ఏమిట‌ని నిల‌దీస్తున్నారు. గ‌తంలో ఆయ‌న చెప్పిన అనేక విష‌యాలు ప‌త్రిక‌ల్లో, టివి ఛాన‌ళ్ల‌లో వ‌చ్చాయ‌ని అంటున్నారు.  చెన్న‌యిలో చెప్పిన విష‌యాల‌నే తిరుప‌తిలోనూ చెప్పాల‌ని కోరుతున్నారు. ఇదిలావుండ‌గా ర‌మ‌ణ దీక్షితులు బుధ‌వారం మ‌ధ్యాహ్నానికి కూడా తిరుమ‌ల‌కు చేరుకోలేదు. చెన్న‌యిలోనే  ఉన్నారు.  ఆయ‌న‌తో మాట్లాడించేందుకు ఇక్క‌డి మీడియా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. గురువారం ఉద‌యం వ‌స్తాన‌ని, అప్ప‌డు మాట్లాడుతాన‌ని ఆయ‌న త‌న‌కు ఫోన్ చేసిన మీడియా  ప్ర‌తినిధుల‌తో చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*