లండన్‌లో మోడీకి వ్యతిరేకంగా నిరసనలు

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లినా…అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశం అవుతారు. ఉద్విగ్నతతో కూడాని భారీ ఉపన్యాసాలు, పిలుపులు ఇస్తుంటారు. ఆ వార్తలు ఇక్కడ మన పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితం అవుతుంటాయి. టివిల్లో ఆ సమావేశాల వార్తలు హోరెత్తుతాయి. ఇవన్నీ తప్పుకాదు…విదేశాల్లో మన ప్రధాన ఏమి మాట్లాడారో, ఏమి చేశారో దేశ ప్రజలకు తెలియజేయడానికి ఈ వార్తలన్నీ వేయాల్సిందే. ఇదే సమయంలో, ఒక ప్రత్యేక సందర్భంలో విదేశాల్లో, మన భారతీయులే ప్రధాన మంత్రిని వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తే…ఆ వార్తకు కూడా అంతే ప్రధాన్యత ఉంటుంది. ఆ విషయాలను కూడా మన ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పత్రికలకు, మీడియాకు ఉంటుంది.

అయితే….బ్రిటన్‌ పర్యటనలో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా భారతీయులు ఆందోళన చేపడితే దాన్ని చూసీచూడనట్లు వదిలేసింది మన మీడియా. చిన్నముక్క వార్తలు వేసినా….అందులో ఏవోవో వ్యాఖ్యానాలు జోడించి…ఆ ఆందోళనకు ప్రాధాన్యత లేకుండా చేశాయి. భారత్‌లో ఇటీవల జరుగుతున్న ఘోర ఉదంతాలకు (బాలికలు, మహిళలపై అత్యాచారాలు; దళితులపై దాడులు వంటి ఘటనలు) నిరసనగా ఈ ఆందోళన జరిగింది. ‘మోడీ నాట్‌ వెల్‌కం’ ‘మోడీ చేతులు దళితుల రక్తంతో తడిచాయి’ అంటూ అనే నినాదాలు రాసిన బ్యానర్లూ ప్రదర్శనలో కనిపించాయి. బ్రిటన్‌ ప్రధాని అధికార నివాసంలో అల్పాహార విందు స్వీకరించడానికి మోడీ వెళ్లిన సమయంలో బ్రిటన్‌ పార్లమెంట్‌ స్కేర్‌ వద్ద ఈ నిరసనలు జరిగాయి. వందలాది మంది పాల్గొన్నారు. అయితే…పార్లమెంట్‌ స్కేర్‌ వద్ద ఉన్న 53 దేశాల జాతీయ పతాకాల్లో భారత్‌ పతాకం చిరిగిపోయివుండటాన్ని నిరసనకారులు బ్రిటన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఆ పతాకాన్ని మార్చారు. ఇక్కడదాకా ఆ వార్త పరిమితం అయింది. పైగా ‘నాట్‌ వెల్‌కం మోడీ’ ‘మోడీ చేతులు దళితుల రక్తంతో తడిచింది’ వంటి నినాదాలు ఏవీ లేవు. ఈ ఆందోళనలో కేరళకు చెందిన ప్రవాసీయులు పాల్గొన్నట్లు బ్యానర్లనుబట్టి తెలుస్తోంది. అయితే కాశ్మీర్‌ వేర్పాటు వాదులు పాల్గొన్నారు వంటి వ్యాఖ్యానాలతో వార్తకు ప్రాధాన్యత తగ్గించేశారు. యూట్యాబ్‌లో దీనికి సంబంధించిన వీడియోలున్నాయి మీరూ చూడొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*