లక లక లక లక…పూర్తిగా మారిన నాగబాబును చూడండి..!

-ఆదిమూలం శేఖర్, సంపాదకులు, ధర్మచక్రం


సినీ‌ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు నటలోనే కాదు…నిజ జీవితంలోనూ పూర్తిగా పరకాయ ప్రవేశం చేయగలరు. చంద్రముఖి సినిమాలో… చంద్రముఖి‌ అవహిస్తే హీరోయిన్ ఎలా మారిపోతుందో నాగబాబు కూడా పూర్తిగా మారిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు.

తన హృదయంలో విప్లవ వీరుడు చేగువేరా స్థానంలో గాంధీ హంతకుడైన గాడ్సేను ప్రతిష్టించి లక లక లక లక…అంటూ వికటాట్టహాసం చేస్తున్నారు. గాడ్సేను దేశభక్తుడని ఆయన కీర్తిస్తుంటే… అభిమానులు వెర్రి మొఖాలు వేసుకుని చూస్తున్నారు.

జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కు‌ ఆతన పెద్దన్న చిరంజీవి దూరంగా ఉంటున్న తప్పటికీ చిన్న‌ అన్న నాగబాబు మాత్రం తోడుగా ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున ఎంపి‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

జనసేన పార్టీ సిద్ధాంతాల్లో అత్యంత కీలకమైవి…మత ప్రమేయం లేని రాజకీయాలు, కులాలను కలుపుకెళ్లే రాజకీయాలు వంటివి ఉన్నాయి. జనసేన సిద్ధాంతాలు ప్రగతిశీలంగా కనిపించాయి.‌ దీనికి తగినట్లుగానే ఆయన వామపక్షాలతో కలిసి అడుగులు వేశారు. మొన్నటి ఎన్నికల్లో బిఎస్పీని, వామపక్షాలను కలుపుకుని పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు రాలేదు. అది వేరే సంగతి.

సిపిఎం నేత మధుతో పవన్ కల్యాణ్

ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ ఎందుకో మనసు‌ మార్చుకున్నారు. తన దారిని మార్చుకున్నారు. కాదు…పూర్తి వ్యతిరేక దిశలో ప్రయాణం మొదలు పెట్టారు. తన పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి బిజెపితో జత కట్టారు.

అప్పటి నుంచి మతపరమైన విషయాలనే ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన భాష మారిపోయింది. గతంలో అంతా చేగువేరా, శ్రీశ్రీ, బాలగంగాధర తిలక్ వంటి వాళ్ల గురించి మాట్లాడే…ఆయన భాష పూర్తిగా మారిపోయింది. బిజెపి కంటే ఎక్కువగా మతాన్ని రాజకీయాల్లోకి‌ తీసుకొస్తున్నారు.‌ ఆఖరికి తిరుమలలో‌ అన్యమత ప్రచారం వంటి‌ అసంబద్ధ అంశాలనూ ప్రధానంగా ప్రస్తావించే పరిస్థితికి చేరుకున్నారు.

తిరుమలలో కొత్త వస్త్రధారణలో పవన్

ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలను వేరుగా చూడలేం. పవన్ తీరుకు కొనసాగింపుగానే చూడాలి. ముందే చెప్పినట్లు…పవన్ కల్యాణ్ పూర్తిగా మారినట్లే నాగబాబూ సంపూర్ణంగా మారిపోయారు. బిజెపి కంటే తామే హిందూత్వకు ప్రతినిధులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గాడ్సేను దేశభక్తుడంటూ కీర్తించారు.

నాగబాబు ఏమి ఆశించి ఆ వ్యాఖ్యలు చేసినా…ఆయనకు వ్యక్తిగతంగా జరిగే నష్టంకంటే…జనసేనకు పార్టీగా జరిగే నష్టమే ఎక్కువ. గాంధీ హంతకున్ని దేశభక్తునిగా కీర్తిస్తే స్వాగతించే పరిస్థితి లేదు. నాగబాబుపై జనంలో ఎంత ఆగ్రహం వ్యక్తమవుతోందో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చివరిగా చెప్పేదేమిటంటే…బిజెపితో జతకట్టిన జనసేన, హిందూత్వకు తామే ప్రతినిధులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తే…దాన్ని బిజెపి కూడా ఆమోదించదు. కమలంతో జతకట్డడం వేరు…ఆ పార్టీ సిద్ధాంతాలను పులుముకోవడం వేరు. ఇప్పుడు పవన్, నాగబాబు చేస్తున్నది అదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*