లడ్డూలు, ఆస్తులపై భక్తులను గందరగోళానికి గురిచేయొద్దు : టిటిడి ఛైర్మన్

         తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ములు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్న 50 ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం  ఉప‌యోగ‌ప‌డ‌నివేనని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.. కొన్ని టివి ఛాన‌ళ్ళ‌లో ఈ విష‌యానికి సంబంధించి అవాస్త‌వ స‌మాచారంతో భ‌క్తుల్లో గంద‌ర‌గోళం ఏర్ప‌డిందనీ, అయితే  వాస్త‌వాలు ఇలా ఉన్నాయని ఆయన తెలిపారు.

        జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), తేదీ 09 – 04 – 1990 రూల్ -165, చాప్ట‌ర్ – 22, ద్వారా టిటిడికి మేలు క‌లిగే అవ‌కాశం ఉంటే దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం, లీజుకు ఇవ్వ‌డం లాంటి అధికారాలు టిటిడి బోర్డుకే ఉన్నాయని చెప్పారు.  అదేవిధంగా బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
 
  దేవ‌స్థానం నిర‌ర్థ‌క ఆస్తుల అమ్మక ప్ర‌క్రియ 1974 నుండి జ‌రుగుతోందన్నారు. ఈ ర‌కంగా 2014 వ‌ర‌కు 129 ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ము ద్వారా విక్ర‌యించ‌డం జ‌రిగిందన్నారు. ఇదే క్ర‌మంలో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి అధ్య‌క్షులుగా గ‌ల పాల‌క‌మండ‌లి తీర్మానం నంబ‌రు 84 తేదీ 28 – 07 – 2015 మేర‌కు టిటిడికి ఏర‌కంగాను ఉప‌యోగ‌ప‌‌డ‌ని ఆస్తుల‌ను గుర్తించి బ‌హిరంగ‌ వేలం ద్వం్వారా వాటిని విక్ర‌యించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌డానికి ఒక స‌బ్ క‌మిటీని నియ‌మించినట్లు చైర్మన్ చెప్పారు. ఈ స‌బ్ క‌మిటీలో అప్ప‌టి పాల‌క మండ‌లి స‌భ్యులు శ్రీ జి.భాను ప్ర‌కాష్‌రెడ్డి, జె.శేఖ‌ర్‌, డి.పి.అనంత, ఎల్లా సుచ‌రిత, సండ్ర వెంక‌ట వీర‌య్య లను స‌భ్యులుగా నియ‌మించారన్నారు. 

          అప్పటి స‌బ్ క‌మిటీ నివేదిక మేరకు , అప్పటి తీర్మానం నెం. 253 తేదీ 30 – 01- 2016 ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌లో స‌బ్ క‌మిటీ గుర్తించిన 50 నిర‌ర్థ‌క ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ము ద్వారా విక్ర‌యించ‌డానికి శ్రీ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ఆధ్య‌క్ష‌త‌న గల పాలక మండ‌లి ఆమోదం తెలిపినట్లు చెప్పారు..

  ఈ తీర్మానం మేర‌కు దేవ‌స్థానం సిబ్బంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల‌లో గ‌ల 17 ఆస్తులు, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోని 9 ఆస్తులు, త‌మిళ‌నాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యాల రికార్డుల‌లోని విలువ, బ‌హిరంగ మార్కెట్ విలువ‌ల‌ను సేక‌రించి పాల‌క‌మండ‌లికి నివేదించడం జరిగింది. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండ‌టంతో వేలం ప్ర‌క్రియ నుంచి మినహాయించడం జ‌రిగింది. అలాగే రుషికేష్‌లో ఒక ఎక‌రా 20 సెంట్ల భూమి వ‌ల్ల టిటిడికి ఎలాంటి ఉప‌యోగం లేకుండా దురాక్ర‌మ‌ణ‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉండ‌టంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చినట్లు చెప్పారు.  

        పై తీర్మానం మేర‌కు 50 నిర‌ర్థ‌క ఆస్తుల విలువ‌ను రూ. 23.92 కోట్లుగా ప్ర‌స్తుత పాల‌క మండ‌లి తీర్మానం నెం.309 తేదీ 29-02 – 2020 ద్వారా ధ‌ర నిర్ణ‌యిస్తూ గ‌త పాల‌క మండ‌లి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌దానికి ఆమోదం మాత్రమే తెలపడం జ‌రిగిందన్నారు. ఈ  ఆస్తులు దేవ‌‌స్థానానికి ఏవిధంగాను ఉప‌యోగ‌ప‌డేవి కాదన్నారు. సదరు నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివలన దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ము ద్వారా విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగిందన్నారు. అయితే కొన్ని ప్ర‌సార సాధ‌నాలు టిటిడి ఆస్తుల వేలం విక్ర‌యానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న , పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు , ప్ర‌భుత్వానికి లింకు పెట్ట‌డం స‌రికాదని వైవి చెప్పారు.  వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార సాధనాలు అవాస్తవ సమాచారం తో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని సుబ్బారెడ్డి చెప్పారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*