లడ్డూలు తయారుచేసే బ్రాహ్మణులకే….లడ్డూ తినే భాగ్యం లేదు..!

టిటిడి అధికారుల నిర్ణయాలు చాలా వింతగా ఉంటాయి. శ్రీవారి లడ్డూలు తయారుచేసే బ్రాహ్మణులకే లడ్డూ తినే భాగ్యం లేదంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శ్రీవారి పోటు కార్మికులు…అధికారులకు ఇబ్బంది వచ్చినపుడు ప్రెస్‌మీట్లు పెట్టించి అన్నీ బాగున్నాయని చెప్పించడానికి మినహా ఏ హక్కులకూ వాళ్లు పనికిరారు. అసలు విషయం ఏమంటే…

తిరుమల శ్రీవారి లడ్డూలను తయారుచేసే పోటులో 500 మంది దాకా బ్రాహ్మణులు అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిపైన పని చేస్తున్నారు. ప్రతిఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఉద్యోగులకు లడ్డూ, వడ బహుమానంగా ఇస్తారు. మళ్లీ బ్రహ్మోత్సవాలు వస్తున్నా ఇప్పటిదాకా పోటు ఉద్యోగులకు మాత్రం లడ్డూ, వడ ఇవ్వలేదు. అడిగితే….అకౌంట్స్‌ విభాగం పెద్దలు లెక్కలు వేస్తున్నారట. చాలా ఏళ్లుగా పెద్దలడ్డూ, వడ ఇచ్చేవారు. పెద్దలడ్డు ధర అప్పట్లో రూ.25 ఉండేది. దాన్ని ఇటీవల రూ.200కు పెంచిన విషయం తెలిసిందే. వడ ధర రూ.100 అయింది. ఈ ధరలు లెక్కించి…’మీకు ఒక లడ్డూ, ఒక వడ ఇస్తే రూ.300 అవుతుంది….500 మందికి ఇవ్వాలంటే రూ.1,50,000 అవుతుంది…ఇంత ఖర్చా’ అని లెక్కలు వేశారట ఆయనగారు. దీంతో చేసేది లేక ఈవోను కలిశారు పోటు కార్మికులు. ఆయన చూద్దాం…అని చెప్పి పంపించారట. టిటిడిలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగులకు నెలకు 10 లడ్డూలు రూ.10 వంతున ఇస్తుంటారు. ఆ సదుపాయం పోటులో పనిచేసే వారికి లేదు. అదేవిధంగా దర్శన సదుపాయమే లేదు. గుర్తింపు కార్డులూ లేవు. శ్రీవారి సేవకులకు ఇచ్చే కార్డులు వీరికీ ఇస్తున్నారు. తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని; దర్శనం, లడ్డూల సదుపాయం కల్పించాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సాంబశివరావు ఈవోగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఫైలు సిద్ధమయింది. ఇంతలో ఆయన బదిలీ అవడంతో బ్రేక్‌పడింది.

పోటులో తవ్వకాలు జరిగాయని రమణ దీక్షితులు ఆరోపణలు చేసినపుడు…ఇదే పేద బ్రాహ్మణులను మీడియా ముందుకు తీసుకొచ్చి అన్నీ బాగున్నాయని చెప్పించారు. తమకు కష్టమొచ్చినపుడు గుర్తుకొచ్చిన పోటు కార్మికుల కష్టాలు మాత్రం అధికారులకు పట్టవు. అయినా కొన్నేళ్లుగా ఇస్తున్న లడ్డూ, వడ ఇవ్వడానికి కూడా లెక్కలు వేసి, ఏదో తామే టిటిడిని ఉద్దరిస్తున్నట్లు మాట్లాడటం ఏమిటని నిలదీస్తున్నారు కార్మికులు. ప్రభుత్వం ఆదేశిస్తే నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోకుండా సంతకాలు పెట్టి కోట్లకు కోట్లు దుర్వినియోగం చేస్తున్న అధికారులకు తమకు లడ్డూవడ ఇవ్వాల్సి వచ్చే సరికి ఖర్చులు గుర్తుకొస్తున్నాయని వాపోతున్నారు. ‘ఇదీ శ్రీవారి ఆలయంలో బ్రాహ్మణులకు ఇస్తున్న గౌరవం’ అని ఆవేదన చెందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*