లోకేష్‌ బాబూ మీరెక్కడ పోటీ చేస్తారో చెప్పండి!

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా….ర్నూలులో టిడిపి తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటించారు మంత్రి నారా లోకేష్‌. కర్నూలు ఎంపిగా బుట్టా రేణుక, ఎంఎల్‌ఏగా ఎస్‌వి మోహన్‌ రెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. అయినా….టిడిపి అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్‌కు ఉన్న అర్హతలేమిటి? అధికారాలేమిటి? అనే విషయాలను పక్కనపెడితే..వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది తేలడం లేదు. గత ఎన్నికల్లోనే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని భావించినా…ఆయన తెర వెనుకే ఉన్నారు. టిడిపి గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత తన కుమారుడైన లోకేష్‌ను ఎంఎల్‌సిని చేసి, మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. దీనిపైన విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికల్లో లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారని ఇప్పటికే టిడిపి నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వడం లేదు. ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా, ఎంతటి ఉద్దండులు బరిలోకి దిగినా….టిడిపినే గెలవగల స్థానం నుంచి లోకేష్‌ పోటీ చేస్తారనడంలో సందేహం లేదు. అటువంటి స్థానం కోసమే వెతుకుతున్నారట. తన తండ్రి చాలాకాలంగా పోటీ చేస్తున్న కుప్పం నుంచిగానీ, ప్రస్తుతం తన మామ ఎంఎల్‌ఏగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురం (గతంలో తాన ఎన్‌టిఆర్‌ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కూడా) నుంచిగానీ పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయవచ్చని కూడా చెబుతున్నారు.

కుప్పం నుంచి లోకేష్‌ పోటీ చేస్తే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకుంటారా? లేక నియోజకవర్గం మారుతారా? వాస్తవంగా వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసి, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారం ఉంది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే ప్రకటించడానికి టిడిపి సిద్ధంగా లేదు. దానివల్ల రాజకీయంగా నష్టం వస్తుందని భావిస్తోంది. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా పోటీలో ఉండాల్సిందే. ఇక బాలకృష్ణను తప్పించడానికి వీల్లేదు. ఎందుకంటే…ఎన్‌టిఆర్‌ కుటుంబం నుంచి టిడిపిలో ఉన్నది ఆయనొక్కరే. అంటూ ఈ ముగ్గురూ బరిలోనే ఉంటారు. దీన్నిబట్టి ఇప్పుడు తేలాల్సింది ఏమంటే….కొత్తగా ఇంకో నియోజకవర్గం అర్జెంటుగా కావాలి. అదీ ఘంటాపథంగా గెలిచే నియోజకవర్గం కావాలి. ఆ అన్వేషణలోనే ఉన్నారట టిడిపి నేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*