లోకేష్‌ లాజిక్‌తో మోడీకి దిమ్మతిరిగిపోతుందేమో..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు విషయ పరిజ్ఞానం లేదని, సరిగా మాట్లాడలేరని సోషల్‌ మీడియాలో ఎద్దేవా చేస్తుంటారుగానీ…ఆయన లాజిక్‌ వింటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా దిమ్మదిరిపోతుంది. ఆయన పాయింటు లేవనెత్తారంటే ఇక దానికి తిరుగువుండదు. అటువంటి పాయింటునే లేవనెత్తారు కర్నూలు పర్యటనలో. ఇంతకీ అసలు విషయం ఏమంటే…

గత ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయడమేగాక, నాలుగేళ్లపాటు ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాలను నడిపిన తెలుగుదేశం పార్టీ….నాలుగు నెలల క్రితం కమలంతో స్నేహానికి చెల్లుచీటీ ఇచ్చింది. అంతకు మునుపు బిజెపిపై ఈగ వాలనీకుండా చూసుకున్న టిడిపి నేతలే ఇప్పడు విరుచుకుపడుతున్నారు. ఆగర్భ శత్రువుల్లాగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రతి సభలోనూ బిజెపిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపికి కొత్త పేరు పెట్టారు లోకేష్‌. బి – భారతీయ జనతా పార్టీ, జె-జగన్‌ పార్టీ, పి-పవన్‌ కల్యాణ్‌ పార్టీ అని చెప్పారు. ఇది వినడానికి బాగానే ఉంది. ఇంకో మాట కూడా అన్నారు యువ నేత. ‘బిజెపి రాయలసీమ మీద ప్రేమ ఒలకబోస్తూ రాయలసీమ డిక్లరేషన్‌ విడుదల చేసింది….నిజంగా అంత ప్రేమవుంటే…దేశ రెండో రాజధానిగా కర్నూలును ఎందుకు ఏర్పాటు చేయడం లేదు’ అంటూ కేంద్రాన్ని నిలదీశారు.

చంద్రబాబు నాయుడు, లోకేష్‌ పుట్టిన రాయలసీమలో రాజధాని కాదుగదా….హైకోర్టు ఏర్పాటు చేయమన్నా పట్టించుకోకుండా సీమకు అన్యాయం చేస్తున్నది టిడిపి. సీమలోని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ఎస్‌ఎస్‌ కెనాల్‌ వంటి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉండగా…వందల కోట్లు ఖర్చు చేసి పట్టిసీమను నిర్మించారు. ఇంకా పురుషోత్తమపట్నం, వైకుంఠపురం ఇలా ఏవేవో పేర్లు చెబుతూ కోస్తా జిల్లాలకు మేలుచేసే పనులు చేస్తున్నారు. సీమకు చేస్తున్న ద్రోహం ఏమిటో ఇక్కడి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటికి సమాధానం చెప్పకుండా….కర్నూలులో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలట. ఇది తెలుగుదేశం పార్టీ అధికారికంగా డిమాండ్‌ చేస్తోందా? లేక ఊసుపోకుండా, తెలివిగా మాట్లాడుతున్నానని చెప్పుకపోడానికి లోకేష్‌ బాబు ఈ మాటలన్నారా..అనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే చెప్పాలి. ఏమైనా లోకేష్‌ డిమాండ్‌తో మోడీకి మతిపోవడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*