లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లు స‌రే…పంచాయ‌తీ ఎన్నికల మాటేమిటి?

ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపిలు సమర్పించిన రాజీనామాలు జూన్‌ 2లోపు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయని, అలాంటి పిరిస్థతి వచ్చినా ఎదుర్కోడానికి తమ పార్టీ సిద్ధంగా ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆ ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది లోక్‌సభ స్పీకర్‌ చేతిలో ఉంది. రాజీనామాలను ఆమోదించకుండా నాన్చుతూపోతే ఉప ఎన్నికలు రావు. సాధారణ ఎన్నికలకు ఆరు నెలలు ముందుగా ఏ లోక్‌సభ స్థానం ఖాళీ అయినా అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించరు. సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నిక జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేదు. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపిల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారని అనుకోలేం. ఆమోదించడం వల్ల ఉప ఎన్నికలు వస్తే అనవసరం భారం, ప్రజాధనం వృథా తప్ప ప్రయోజనం ఉండదు.

లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలను పక్కనపెడితే…పంచాయతీ సర్పంచ్‌, ఎంపిసిటి, జెడ్‌పిటిసి ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు నెల రోజుల్లో ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం చేయమని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను వెంటపడుతోంది. దీనికి 15 రోజుల గడువును పొడిగించింది. ఎన్నికల సంఘం రెడీ అవుతోందన్నమాట. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ రెడీ అవుతుందా…? అనేద ప్రశ్న. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు చాలాకాలం పాటు ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్‌ ఆఫీసర్లతో నెట్టుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే….పార్టీల బురుగు ఏమిటో బయటపడిపోతుంది. దీని ప్రభావం ఎంఎల్‌ఏ, ఎంపి ఎన్నికలపై ఉంటుందన్న భయం రాజకీయ పార్టీల్లో ఉంటుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకంటే కొన్ని నెలల ముందు జరిగాయి. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన ఆలోచన అప్పటికే కాంగ్రెస్‌ మదిలో ఉంది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో తమ పార్టీకి మేలు జరుగుతుందన్న ఆలోచన ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు పచ్చజెండా ఊపేసింది. ప్రస్తుతం అధికార పార్టీనే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లినా టిడిపికి పెద్దగా లాభించేది ఉండదు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి…అసెంబ్లీ ఎన్నికలు అయ్యేదాకా వాయిదా వేసే సూచనలే మెండుగా కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*