వకులమ్మా…నువ్వే చెప్పాలమ్మా!

తిరుమల శ్రీవారి ఆయంలో ప్రతిదీ ఆగమోక్తంగా జరుగుతుంటాయి. కోట్లాది మంది పూజించే శ్రీవేంకటేశ్వరునికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తుంటారు. వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచరణతో కొన్ని సంప్రదాయాలు కూడా స్థిరపడ్డాయి. మొదటి ప్రాకారం లోపల ఉన్న వకులామాత పోటులో (పాకశాల) అన్నప్రసాదాలు తయారుచేసి శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. దాదాపు వెయ్యి ఏళ్ల నుంచి ఇక్కడే ప్రసాదాలు సిద్ధమవుతున్నాయి. అయితే…ఇటీవల 20 రోజుల పాట ఈ పాకశాలను మూసేశారని, రిపేర్ల పేరుతో నిధుల కోసం తవ్వకాలు జరిపారని, ఆ సమయంలో సంప్రదాయాని విరుద్ధంగా రెండో ప్రాకారంలో అన్నప్రసాదాలు చేయించి నైవేద్యంగా సమర్పించారని, అది తీమ్రైన అపచారమని ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా బయట నైవేద్యం తయారు చేయించి తీసుకురావడం ఇదే మొదటిసారని చెప్పారు. ఇలాపెట్టిన నైవేద్యాన్ని స్వామి స్కీరించరని, 20 రోజులు శ్రీవారిని పస్తు పెట్టారని ఆవేదనతో చెబుతున్నారు.

రమణ దీక్షితులు చేసిన ఈ ఆరోపణలకు టిటిడి ఈవో వివరణ ఇచ్చారు. పోటు మరమ్మతులను ఆగమ శాస్త్ర సలహాదారుల అనుమతితోనే చేశామని చెప్పారు. అయితే ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు సమ్మతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. దీన్ని అడిగితే…వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు ఆయన చేసిన సంతకం చూపిస్తున్నారు. రథమండపం కూల్చివేతకు సంతకం పెట్టారని చెబుతున్నారు. పోటు మరమ్మతులకు ఆయన అమోదం అవసరం లేదని ఎందుకు భావించారు? అప్పటికే రమణ దీక్షితులుపైన అధికారులకు వ్యతిరేకత ఉందా? అదేవిధంగా గతంలోనూ రెండు పర్యాయాలు పోటుకు మరమ్మతులు చేశామని, అప్పుడు కూడా ప్రసాదాలు బయటే తయారు చేయించామని ఈవో చెప్పారు. గత వెయ్యేళ్లలో ఎప్పుడూ ప్రసాదాలు బయట సిద్ధం చేసిన దాఖలాలు లేవని దీక్షితులు అంటున్నారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? ఇలా ఎప్పుడైనా జరిగిందో లేదో వకులామాతే చెప్పాలి.

వకులామాత పోటులో చిన్నిచిన్న మరమ్మతులు మాత్రమే చేశామని చెబుతున్న అధికారులు….ప్రత్యక్షంగా మీరూ చూడండి అంటూ మీడియా ప్రతినిధులను ఆలయం లోనికి తీసుకెళ్లారు. పోటుదాకా తీసుకెళ్లారుగానీ లోనికి అనుమతించలేదు. తలుపులు తీసి బయట నుంచి చూడమన్నారు. గోడ అడ్డంగా ఉండటంతో ఎలాంటి మరమ్మతులు జరిగాయో కూడా అర్థంకాలేదు. పోటు లోపల నుంచి ఇంకెక్కడికో సొరంగం ఉందన్న ప్రచారం ఉందని, ఆ సొరంగంలో పద్మనాభస్వామి ఆలయం లాగా నిధులు ఉండొచ్చన్న ఆలోచనతోనే తవ్వకాలు జరిపారన్నది రమణ దీక్షితులు ఆరోపణ. లోనికెళ్లి చూస్తేగానీ, అదీ ఇంజినీర్లు పరిశీలీస్తేగానీ తవ్వకాలు జరిపిందీ లేనిదీ చెప్పలేం. రమణ దీక్షితులు తవ్వకాలు జరిపారని అంటున్నారు, అధికారులేమో లేదంటున్నారు…తేలాలంటే పురావస్తుశాఖ అధికారులు ఒకసారి పోటును పరిశీలించడమే ఏకైక పరిష్కారం. మరెందుకో పురావస్తు శాఖ అంటేనే టిటిడి అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ పరిశీలించి, ఏమీ జరగలేదని ధ్రువీకరిస్తే ఇక రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలకు విలువే ఉండదు. లేనిపక్షంలో భక్తుల్లో ఈ అనుమానాలు ఎప్పటికీ అలాగేవుండిపోతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*