వర్మ…నాగ్‌ అభిమానుల తన్నులు తప్పించుకోలడా!

నిత్యం వివాదాల్లో ఉండే…రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఎలావుంటుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో రాంగోపాల్‌ వర్మ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అంతకు మించి ఆయనకు ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ భారీ విజయాలేవీ లేవు. ఆ మాటకొస్తే ప్రముఖ హీరోలు ఎవరూ ఆయనతో సినిమాలు చేయలేదు. వెబ్‌ సీరీస్‌లు వంటి వాటితోనే వర్మ వార్తల్లో ఉంటున్నారు. ఒకప్పుడు నాగార్జునతో శివ చిత్రాన్ని నిర్మించి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు వర్మ. ఆ తరువాత నాగార్జునతో గోవింద గోవింద చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆఫీసర్‌ అంటున్నారు. నిజాయితీ కలిగిన ఓ ఆఫీసర్‌ నెగిటివ్‌గా ప్రవర్తిస్తే ఎలావుంటుందో చెప్పే ఒక కథ అని రాంగోపాల్‌ వర్మ ఇప్పటికే చెప్పారు.

ఈ చిత్రం గురించి నాగార్జునకు చెప్పినపుడు….ఆయన వెంటనే అంగీకరించలేదు. రాంగోపాల్‌ వర్మ ఎప్పుడూ స్థరమైన అభిప్రాయంతో ఉండరు. అందుకే మూడు నెలల తరువాత కూడా ఇదే కథతో వస్తే అప్పుడు చూద్దాం అని చెప్పారట. రాంగోపాల్‌ వర్మ అదే కథతో మళ్లీ వెళ్లి నాగార్జను కలిసి వినిపించారట. అదేవిధంగా కథను చెప్పిన విధంగా తీయకుంటే ‘నన్ను తన్నండి’ అని నాగార్జనకు ఉత్తరం రాశారట వర్మ. ఆ విషయాన్ని నాగార్జునే బహిరంగంగా చెబుతున్నారు.

చిత్రం బాగా వచ్చిందని, తన్నులు తినాల్సిన అవసరం రాలేదని నవ్వుతూ నాగార్జున చెబుతున్నారు. ఈ సినిమాతో రాంగోపాల్‌ వర్మ మళ్లీ ప్రముఖ హీరోలతో చిత్రాలు తీసే పరిస్థితి వస్తుందంటున్నారు. తన్నులు తినాల్సిన అవసరం లేదని నాగార్జున చెబుతున్నారుగానీ….ఆయన అభిమానులు ఏమంటారో తెలియాలంటే సినిమా విడుదల కావాల్సిందే. ఆఫీసర్‌ నాగ్‌ అభిమానులకు నచ్చుతాడా? అంతకు మించి వర్మ వారిని మెప్పించి తన్నులు తప్పించుకుంటారా…! చూద్దాం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*