వాటర్ బాటిల్ చేసిన పాపం ఏమిటో… కూల్ డ్రింక్ బాటిల్ చేసిన పుణ్యం ఏమిటో..! తిరుమలేశా..!!

పర్యావరణ పరిరక్షణ పేరుతో తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో గాజు నీటి సీసాలు ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో వేలాది మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయినా టిటిడి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం టిటిడి అంత నిబద్ధత ప్రదర్శించడం మంచిదే.

అయితే…ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిళ్లు మాత్రం తిరుమల దుకాణాల్లో విక్రయిస్తున్నారు. పెప్సీ, థమ్స్ అప్, స్ర్పయిట్, మాజా వంటి బహుళజాతి కంపెనీల శీతల పానీయాలు లభిస్తున్నాయి. ఇవి గాజు బాటిళ్లలోనూ, ప్లాస్టిక్ బాటిళ్లలో దొరుకుతున్నాయి. వాటర్ బాటిళ్లను నిషేధించిన నేపథ్యంలో భక్తులు ఈ కూల్ డ్రింక్ బాటిళ్లనే ఆశ్రయించే అవకాశం ఉంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా మారే పరిస్థితి ఏర్పడింది.

అయినా…వాటర్ బాటిళ్లను నిషేధించి కూల్ డ్రింక్ బాటిళ్లను‌ ఎలా అనుమతిస్తారని భక్తులు ప్రశ్నస్తున్నారు. ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిళ్లను అనుమతించడం వెనుక సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలు, కొన్ని విద్యాసంస్థల్లో నిషేధించిన శీతల పానీయాలను తిరుమలలో అనుమతించి…నీటి బాటిళ్లను నిషేధించడంలో ఔచిత్యం లేదని అంటున్నారు. వాటర్ బాటిల్ చేసుకున్న పాపం ఏమిటి…కూల్ డ్రింక్ బాటిల్ చేసుకున్న పుణ్యం ఏమిటని…భక్తులు వాపోతున్నారు.

ధర్మచక్రం దృక్పథం : తిరుమలలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించాడాన్ని ఆహ్వానిస్తోంది. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయం ఉంది. వాటర్ బాటిళ్లకు ప్రత్యామ్నాయం లేదు. అందుకే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించాల్సిన అవసరం లేదు. కూల్ డ్రింక్ బాటిళ్లనూ అరికట్టాల్సిన పని లేదు. తిరుమలలో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి సేకరించి రీసైక్లింగ్‌కు చర్యలు తీసుకోవాలి.

…. ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*