విఐపిల విషయంలో అలా చేయగలిగితే…ధర్మారెడ్డి గ్రేటే..!

గత కొన్ని రోజులుగా తిరుమల విఐపి బ్రేక్‌ దర్శనాల గురించే చర్చ జరుగుతోంది. ఇందులోని ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 కేటగిరీలను రద్దుచేసి, విఐపిలు అందరికీ ఒకే దర్శనం కల్పిస్తామని టిటిడి ప్రకటించింది. దీనిపైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. టిటిడి ఛైర్మన్‌ను, అధికారులను భక్తులు అభినందిస్తున్నారు.

ఈ అంశాన్ని మీడియాకు వివరిస్తున్న సందర్భంగా తిరుమల ప్రత్యేక అధికారి ఎవి ధర్మారెడ్డి ఒకమాట అన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో….విఐపిలకూ లఘు దర్శనం అమలు చేస్తామని చెప్పారు. అంటే, కులశేఖర పడిదాకా పంపకుండా…. రాములవారి మేడ నుంచే దర్శనం చేయించి, వెనక్కి పంపేస్తారు.

ఒకప్పుడు సాధారణ భక్తులనూ కులశేఖరపడి దాకా….అంటే శ్రీవారి గర్భాలయ గడప దాకా అనుమతించేవారు. ఆ తరువాత రద్దీని దృష్టిలో ఉంచుకుని….రాములవారిమేడ దాకా పంపించేవారు. ఇప్పుడు జయ – విజయుల నుంచే దర్శనం చేయించి పంపేస్తున్నారు. విఐపిలను మాత్రం ఇప్పటికీ కులశేఖరపడి దాకా పంపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పద్ధతిని మార్చుతామని ధర్మారెడ్డి అంటున్నారు.

ఒకప్పుడు సామాన్య భక్తులకు లఘు దర్శనం ప్రవేశపెట్టింది ధర్మారెడ్డి ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడే. స్వామి వారి దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే పంపివేయడంపై తొలుత భక్తుల్లో నిసరన వ్యక్తమయింది. అయినా….పట్టించుకోకుండా అదే పద్ధతిని కొనసాగించారు. ఇప్పుడైతే దాన్ని మహాలఘుగా మార్చేశారు. సామాన్యు భక్తుల విషయం చేయగలిగారుగానీ….విఐపిల విషయంలో చేయగలరా అనేదే ప్రశ్న.

ఇందులో ఆచరణాత్మక సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రోటోకాల్‌లోని వ్యక్తులు…అంటే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు వంటివారు రోజూ దర్శనానికి వస్తున్నారు. అలాంటి వారినీ రాములవారి మేడ వద్దే ఆపేస్తారని అనుకోలేం. కచ్చితంగా కులశేఖరపడి దాకా తీసుకెళుతారు. అది జరిగాక మిగిలిన వారిని రాములవారిమేడ వద్ద ఆపడం సాధ్యంకాదు. అలా ఆపితే…అందరూ ఎలాగైనా కులశేఖరపడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోడానికి తాపత్రయపడుతూ పైరవీలు సాగిస్తారు. మళ్లీ ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 2 తీరే అవుతుంది.

గతంలోనే రెండు పర్యాయాలు తిరుమల ప్రత్యేక అధికారిగా పని చేసి, మూడోసారి అదే స్థానానికి వచ్చిన ధర్నారెడ్డికి అనుభవజ్ఞుడిగా పేరుంది. అలాంటి అధికారి విఐపిల బ్రేక్‌ దర్శనాల సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూద్దాం..!

– ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*