విద్యార్థులతో శ్రీవారి కానుకల లెక్కింపు ప్రారంభం…టిటిడిలో కొత్త ప్ర‌యోగం..!

  • దిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

తిరుమల శ్రీవారికి గుట్టలుగా వచ్చిపడుతున్న కరెన్సీ నోట్ల కట్టలు, చిల్లర గుట్టను లెక్కించడం కోసం టిటిడి కొత్త మార్గాన్ని అన్వేషించింది. టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో అటు నోట్లు, ఇటు చిల్లర లెక్కించే ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.

26.08.2019వ తేదీ సోమవారం తొలిసారిగా తిరుమల నోట్ల పరకామణి, తిరుపతిలోని చిల్లర పరకామణిలోకి విద్యార్థులను అనుమతించింది. తొలిరోజు మొత్తం 150 మంది విద్యార్థులు పరకామణి సేవలో పాల్గొన్నారు. ఎస్‌వి ఆర్ట్స్‌ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులను తిరుమలకు పంపించారు. బ్యాచ్‌ -ఎలో 25 మంది, బ్యాచ్‌ – బిలో 25 మంది విద్యార్థుల వంతున నోట్లు లెక్కించారు. అదేవిధంగా తిరుపతిలోని చిల్లర పరకామణిలో ఎస్‌జిఎస్‌ర్ట్స్‌ కాలేజీకి చెందిన 50 మంది, ఎస్‌వి ఓరియంటల్‌ కాలేజీకి చెందిన 50 మంది…మొత్తం 100 మంది రెండు బ్యాచ్‌లుగా పాల్గొన్నారు.

పరకామణి సేవలో పాల్గొనే విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. అదేవిధంగా ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్‌ ఏర్పాటు చేశారు. పరకామణిలోకి వెళ్లాలంటే ఎవరైనా పంచె కట్టుకునే వెళ్లాలి. విద్యార్థులకు టిటిడినే పంచెలు సమకూర్చింది. ఇక తిరుమల పరకామణికి వెళ్లేవారికి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. రూ.5 వంతున నాలుగు లడ్డూలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి 25 మంది విద్యార్థులను గైడ్‌ చేయడానికి ఒక అధ్యాపకుడు కచ్చితంగా వెంట ఉండాలని టిటిడి ఈవో ఆదేశాలు జారీ చేశారు.

కానుకల లెక్కింపు…ప్రత్యేకించి చిల్లర లెక్కింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. పరకామణి సేవలో పాల్గొనేందుకు టిటిడి ఉద్యోగులు మొదటి నుంచి అనాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిటిడి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. శ్రీవారి సేవకులను నియమించింది. బ్యాంకులకే అప్పగిసే…వారే చిల్లర లెక్కించి తీసుకెళ్లేలా ఒక ఆలోచన చేసింది. దీనిపై వ్యతిరేకత రావడంతో విరమించుకుంది.

ఇప్పటికీ చిల్లర పరకామణిలో టన్నుల కొద్దీ నాణేలు గుట్టగా పోసివున్నాయి. ఇప్పటిదాకా జరుగుతున్న పద్ధతిలో ఈ నాణేలను లెక్కించాలంటే సంవత్సరాలు పట్టవచ్చు. అదేసమయంలో ఎప్పటికప్పుడు రోజూ చిల్లర వచ్చి చేరుతుంటుంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించారు టిటిడి అధికారు.

టిటిడికి తిరుపతిలో ఎస్‌వి ఆర్ట్స్‌ కాలేజీ, ఎస్‌వి జూనియర్‌ కాలేజీ, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కాలేజీ, ఓరియంటల్‌ కాలేజీ, ఎస్‌పిడబ్ల్యు జూనియర్‌ కాలేజీ, ఎస్‌పిడబ్ల్యూ డిగ్రీకాలేజీ ఉన్నాయి. ఈ కాలేజీల్లో వేలాది మంది విద్యార్థులున్నారు. వీరిని పరకామణి సేవకు ఉపయోగించుకుంటే ఎలావుంటుందన్న ఆలోచనతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

ఒక్కో విద్యార్థికి నెలకోరోజు పరకామణి సేవ విధులు కేటాయించవచ్చు. చదువులకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. టిటిడి విద్యార్థులనేగాక….తిరుపతిలోని ప్రైవేట్‌ కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులనూ ఈ సేవకు వినియోగిం చుకోవచ్చు. ఈ పని చేయడానికి రోజూ వందల మంది విద్యార్థులు ఇష్టంగానే ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.

టిటిడిలోనే పని చేస్తున్న 15,000 కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. ఇందులో డిగ్రీ, ఆపై చదివిన వారు వేలాది మంది ఉన్నారు. ఇలాంటి వారినీ పరకామణి సేవకు వినియోగించుకోవచ్చు. వాస్తవంగా తమకూ ఆ విధులు ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.

ఏదిఏమైనా చిల్లర నాణేల లెక్కింపు సమస్యను పరిష్కరించడంపై టిటిడి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో కచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం కలుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*